LAND GRAB ALLEGATIONS ON MLA KETHIREDDY: అనంతపురం జిల్లాలోని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దావూద్‌లా మారారని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారాయణ అన్నారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వెంకట్రామిరెడ్డి ఎర్రగుట్టపై 100 ఎకరాల భూమిని కబ్జా చేసినప్పటికీ.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాలయాన్ని కూల్చేసి కట్టడాలు..
కొండపై శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి పురాతన నాగదేవత ఆలయాన్ని కూల్చి.. గుప్త నిధులు కొల్లగొట్టి, పెద్ద బంగ్లాను నిర్మించారంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. చెరువులో బోటు మీద వెళ్లి కొండపై బంగ్లా చేరుకునే జలమార్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పోలీసులు అటుగా కన్నెత్తి చూడటం లేదని మండిపడ్డారు.
మిన్నకుంటున్న అధికారులు..
ఆ ప్రాంతంలో 15 ఎకరాల మేర చెరువును పూడ్చివేసి.. స్థలాన్ని కబ్జాచేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. సమాచార హక్కు చట్టం కింద భూముల వివరాలు అడిగితే.. తమవద్ద ఆ సమాచారం లేదంటూ.. ఎమ్మెల్యే కబ్జాకు అధికారులు సైతం అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. కొండగుట్ట ఆక్రమణలపై హరిత ట్రైబ్యునల్లో కేసు నమోదు చేయటంతో పాటు, గవర్నర్ను కలిసి వివరాలు సమర్పించి.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరనున్నట్లు సూర్యనారాయణ స్పష్టం చేశారు. భూముల కబ్జాకు సంబంధించిన ఆధారాలు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విలాసాలకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేశారు.
ఇదీ చదవండి:
Sathya Sai Drinking Water Scheme: సత్యసాయి తాగునీటి పథకంపై నీలినీడలు...