Kalava On YSRCP Govt: ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రజా దోపిడీ ఆర్థికవేత్తలకు సైతం అంతుపట్టడం లేదని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. వైకాపా దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఊరూరా గౌరవ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైందని, ఓటీఎస్ పేరుతో ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్న వారి నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని అన్నారు. వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలు సేకరించటానికి అనుమతి కోసం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి లేఖరాస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ రాయితీ ఇస్తుందో లేదో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ..ఇప్పటికే గౌరవ సభలు ప్రారంభించామని, ఈనెల 11 నుంచి అన్ని నియోజకవర్గాల పరిధిలో సభలు మొదలవుతాయని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల నుంచి దోచుకుంటున్న ప్రభుత్వ వైఖరిని తెలియచెబుతూ గౌరవ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
శాంతియుత ఆందోళనలు చేస్తే..కేసులా ?
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన నిర్వహించినందుకు తమపై పోలీసులు కేసులు పెట్టారని కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. గుమ్మగట్ట మండలంలో రోడ్డు ప్రమాదానికి కారకుడు వైకాపా నేత కావటంతో నిందితుడిని రక్షించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న తమపై కేసులు పెట్టారని, ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉండదని అన్నారు. పోలీసులు బాధితుల పక్షాన నిలవాల్సింది పోయి, ప్రమాదం చేసిన వైకాపా నాయకుడికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి
ROAD ACCIDENT IN ANANTAPUR: ఆటోను ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి