అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికలకు అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు హామీలు ఇస్తున్నారు.
అనంతపురం జిల్లాలో..
పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఉరవకొండలో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో విద్యావంతురాలైన తనను గెలిపించినట్లైతే ఉరవకొండ అభివృద్ధికి పాటుపడతానని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవకి దేవి తెలిపారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నానన్నారు. ఇళ్ల పట్టాలు, డ్రైనేజీ సమస్య, శ్మశాన వాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.
తాను సర్పంచ్‌గా గెలిచిన వెంటనే ఉరవకొండను అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇంటి పట్టాలు పంపిణీ అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా దేవకిదేవి పట్టణంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఆమెతో.. తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. దేవకిదేవిని గెలిపించాలని ప్రజలను కోరారు.
నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేట మండలం అన్నమేడు, పుదూరులోలో పంచాయతీ ఎన్నికలకు.. అభ్యర్థులు జోరుగా ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా తమ పార్టీ నాయకులతో కలిసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నమేడు పంచాయతీలో సర్పంచ్, వార్డు అభ్యర్థులకు పోటీ జరుగుతుండగా.. పుదూరు పంచాయతీలో సర్పంచి పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రజల కాళ్లు పట్టుకుని ఆశీర్వదించాలని అభ్యర్థులు కోరారు.