అనంతపురం నగరంలోని డంపింగ్‌యార్డులో చెత్త రీసైక్లింగ్ చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలనే ఉద్దేశంతో 2012లో కంపోస్టుయార్డును నిర్మించారు. 12వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.20 కోట్లు ఖర్చు చేశారు. కానీ, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో యంత్రాలన్నీ వృథాగా మారాయి. చెత్తనిర్వహణ లేకపోవడంతో వ్యర్థాలన్నీ మేటలు వేశాయి. చెత్తతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. స్థల వివాదాల కారణంగా వ్యర్థాలతో విద్యుదుత్పిత్తి కేంద్రం నిర్మాణానికి నోచుకోలేదు. చెత్తచెదారంతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది.
ప్రతిపాదనలకే పరిమితం
డంపింగ్‌యార్డు ఏర్పాటుకు పురపాలకశాఖ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు ఇటీవల నారాయణపురం సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలంలో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు దాదాపు ఖాయమైంది. ప్రత్యేకంగా రహదారులు కూడా నిర్మించాలని చెప్పుకొచ్చారు. దీంతో పాటు అదనంగా కొడిమి వద్ద 263/6 సర్వేనెంబరు భూమిలో 16.85 సెంట్ల స్థలాన్ని డంపింగ్‌యార్డు కోసం కేటాయిస్తూ కలెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అనంతపురం రూరల్ పరిధిలోని ఈ స్థలంలో బయోమైనింగ్ పద్ధతితో చెత్తను రీసైక్లింగ్ చేయాలని ప్రణాళిక రూపొందించారు. గతంలో కూడా ఆలమూరు, ఉప్పరపల్లి, పండమేరు, ముద్దలాపురం తదితర ప్రాంతాల్లో చెత్తతో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించాలని స్థలాలు సేకరించారు. ప్రతిపాదనలు పంపించారు. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నిర్మించాలని ప్రతిపాదనలు వెళ్లాయి. అంతటితోనే ఆగింది. ఇప్పటికైనా సమస్య పరిష్కారమవుతుందా లేదా వేచిచూడాల్సిందే.
బయోమైనింగ్ ప్లాంటుకు చర్యలు
బయోమైనింగ్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. రూ.50 కోట్లు నిధులు విడుదల అవుతున్నాయి. ఈ నిధులతో ప్రస్తుతం ఉన్న చెత్తను రీసైక్లింగ్ చేయిస్తాం. వెలువడే చెత్త నిల్వకుండా ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. - పీవీవీఎస్ మూర్తి, కమిషనర్
ఇదీ చదవండి: ఎల్డీఎఫ్ వ్యూహంతో తమిళనాట కమల్ పోరు