భారతీయ రైల్వేలోని వివిధ కార్యాయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక అభ్యర్థులను కొందరు మోసగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని... ఇలా ఎవరూ మోసపోవద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైల్వేలో ఉద్యోగాలు, ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ ద్వారా ఉద్యోగ ప్రకటను ప్రచురించి, తర్వాత నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులయిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారని తెలిపింది.
గుంతకల్ డివిజన్ పర్సనల్ డిపార్ట్‌మెంట్ వారు సీనియర్ క్లర్క్ ఉద్యోగం కోసం జారీ చేసిన ఉత్తర్వు లేఖతో ఒక అభ్యర్థి కార్యాలయానికి వచ్చారని, దాన్ని పరిశీలిస్తే అది నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. గుంతకల్ డివిజన్ రైల్వే అధికారి జారీ చేయలేదని, ఇలాంటి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను మరో 12 మంది అభ్యర్థులకు కూడా అందజేసినట్టు తెలిసిందని అధికారులు తెలిపారు.
రైల్వే ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులు... ఇటువంటి నేరగాళ్లను ఆశ్రయించవద్దని రైల్వే శాఖ హెచ్చరించింది. ఉద్యోగాలకు సంబంధించిన సరైన సమచారమంతా ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ, ఎస్‌సీఆర్ వైబ్‌సైట్లలో తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి మోసాలు చేసే వారిబారిన పడవద్దని, వారిని నమ్మవద్దని సాధారణ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
రైల్వేలో నియామకాలన్నీ ఆర్‌ఆర్‌బీ, ఆర్‌ఆర్‌సీ ద్వారా వెరిఫికేషన్, పరీక్ష నిర్వహణ తర్వాత మాత్రమే పారదర్శకమైన పద్ధతిలో జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగ భర్తీకి మరో విధానం లేదని, ఉద్యోగ భర్తీలో ఎటువంటి మధ్యవర్తుల పాత్ర ఉండదని, రైల్వే ఉద్యోగం నేరుగా పొందడానికి ఎటువంటి దగ్గరదారి ఉండదని... ఇది గమనించాలని సూచించారు.
ఇదీ చదవండీ... పొంచి ఉన్న 'యాస్' ముప్పు- అధికారులు అప్రమత్తం