పల్లె వైద్యం పడకేసింది.. ప్రాథమిక వైద్య సేవలు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. పలు ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు, సిబ్బంది సక్రమంగా హాజరు కావడం లేదు. విధులకు ఆలస్యంగా వస్తున్నారు.. మధ్యాహ్నానికే ఇంటికి వెళుతున్నారు. 24 గంటలు పనిచేయాల్సిన పీహెచ్‌సీలు సాయంత్రానికి మూతపడుతున్నాయి. వీటిపై పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. పలు ప్రాంతాల్లో సిబ్బందే తమకు తెలిసిన వైద్యం చేసి రోగులకు మందులు అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఒక్కరు కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో జ్వరం, దగ్గు, జలుబు వచ్చినా గ్రామీణులు పట్టణాలకు పరుగులు తీయాల్సి వస్తోంది.
విజృంభిస్తున్న విష జ్వరాలు
జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. ప్రతి పల్లె, మురికివాడలో జ్వర బాధితుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. డెంగీ మహమ్మారి కోరలు చాచింది. ప్రతి వంద మందిలో 20 నుంచి 30 మంది దాకా డెంగీ బారిన పడుతున్నారు. మలేరియా కూడా చాపకింద నీరులా పాకుతోంది. జిల్లా అంతటా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిల్వ ఉంటోంది. దీంతో లార్వా పెరుగుతోంది. దోమల బెడద తీవ్రం కావడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. మరోవైపు కలుషిత నీరు తాగడంతో టైఫాయిడ్, పచ్చకామెర్లు, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నాడీ పట్టే నాథుడే లేరు.
లెక్కలు దాచేస్తూ..
జిల్లాలో ఈ ఏడాది డెంగీ, మలేరియా ప్రబలుతున్నాయి. ఇప్పటిదాకా 4,123 మంది అనుమానితుల నుంచి రక్త నవ΄నాలు తీసి పరీక్షించారు. వీరిలో 99 మందికి డెంగీ ఉన్నట్లు తేలింది. 2.34 లక్షల మంది రక్త నవ΄నాలు పరీక్షించగా.. పదకొండు మందికి మలేరియా ఉన్నట్లు తేల్చారు. జులై మాసంలోనే సర్వజనాస్పత్రిలో 105 మంది డెంగీ రోగులకు వైద్య చికిత్స అందించారు. ఎనిమిది మాసాలకు 99 మందినే లెక్కల్లో చూపించారు. దీన్నిబట్టి తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డెంగీ బాధితులు అధిక సంఖ్యలో ఉన్నారు.
పేరుకే 24 గంటల ఆసుపత్రి
పాల్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
విడపనకల్లు మండలంలోని పాల్తూరు పెద్ద గ్రామం. పదివేల జనాభా ఉంది. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. 24 గంటలు సేవలు అందించాల్సి ఉంది. ఇటీవల ఆరోగ్య కేంద్రాన్ని ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా.. ఉదయం తొమ్మిది గంటలకు ఆసుపత్రిని వాచ్‌మెన్ తెరిచి ఉంచాడు. 10.10 గంటలకు ల్యాబ్ అసిస్టెంట్, స్టాఫ్‌నర్సు, అటెండర్, కాంపౌండర్, డేటా ఆపరేటర్ వచ్చారు. అవుట్ పేషెంట్లకు అటెండర్ ఓపీ చీటీలు రాసి ఇవ్వగా స్టాఫ్‌నర్సు మందులు పంపిణీ చేశారు. ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉన్నారు. వీరు గుంతకల్లు, అనంతపురం నుంచి వస్తున్నారని, నిత్యం ఆలస్యంగా విధులకు హాజరవుతున్నట్లు రోగులు ఆరోపించారు. సాయంత్రం 4 గంటల తర్వాత వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. నిత్యం 70 నుంచి 80 మంది దాకా ఓపీ సంఖ్య ఉంటుంది.
జిల్లా కేంద్రానికి పరుగులు
శింగనమల నియోజకవర్గంలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత రోగులను ఇబ్బందులకు గురి చేస్తోంది. నార్పల, పుట్లూరు, శింగనమల, బుక్కరాయసముద్రంలోని పీహెచ్‌సీల్లో ఇద్దరు చొప్పున వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. వారు కూడా సమావేశాలు, గ్రామాల సందర్శనకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు జిల్లా కేంద్రంలోని సర్వజనాసుపత్రికి పరుగులు తీస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది కూడా విధులకు ఆలస్యంగా వస్తున్నారు.
విధుల్లో ఒక్కరే
పరీక్షిస్తున్న డాక్టర్ శ్రీదేవి
లేపాక్షి ప్రాథమిక కేంద్రానికి నిత్యం 150-180 మంది రోగులు వస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వైద్యులకుగాను ఒకరు డిప్యుటేషన్‌పై వెళ్లారు. మహిళా వైద్యురాలే అన్నీతానై చూస్తున్నారు. ప్రస్తుతం జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో అధిక సంఖ్యలో బాధితులు వస్తున్నారు.
ఆరు దాటితే.. చింతే
వైద్యులు లేక ఖాళీగా కుర్చీ
తాడిమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు ప్రజలకు వైద్యసేవలు అందించాల్సి ఉంది. వైద్యులు సాయంత్రం ఆరు దాటితే కనిపించరు. ఇక్కడ నలుగురు వైద్యులను ప్రభుత్వం నియమించింది. ఇద్దరు వైద్యులను డిప్యుటేషన్‌పై ఇతర వైద్యశాలకు పంపారు. మిగిలిన ఇద్దరు పగలు మాత్రమే ఓపీ రోగులకు వైద్యం అందిస్తున్నారు. రాత్రి సమయాల్లో నర్సు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. సీజనల్ వ్యాధులతో పాటు ప్రసవానికి వచ్చిన మహిళలకు సకాలంలో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
విధులకు డుమ్మా కొడితే చర్యలు :
కొవిడ్ నిరోధక టీకాపై ప్రత్యేక దృష్టి సారించాం. రెగ్యులర్ కార్యక్రమాలపైనా శ్రద్ధ చూపుతున్నాం. ప్రస్తుతం విష జ్వరాలు ప్రబలుతున్నాయి. అందులోనూ డెంగీ ఎక్కువే ఉంది. నిర్దేశిత పని వేళల్లో రోగులను వైద్యం అందించాల్సిందే. ఎవరైనా వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొడితే సహించేది లేదు. శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ జ్వరాల నియంత్రణ చర్యలు చేపట్టాలి. - డాక్టర్ రామసుబ్బారావు, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌ఓ
ఇదీ చదవండి: దేవుడి సేవలోనే చివరి క్షణాలు.. పూజారి జీవితం విషాదాంతం!