అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తన స్వగృహంలో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్లకార్డు చేతపట్టుకొని రెండవ రోజు నిరసన చేపట్టారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ ప్రాంతాలకు దేశ రాజధాని 1500 కిలోమీటర్లు.. విశాఖ రాజధాని అందుకు సమానంగా 1200 కిలోమీటర్ల దూరంలో ప్రకటించారని మండిపడ్డారు.
విశాఖ రాజధాని రాయలసీమ ప్రజలకు మరణ శాసనమని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతిలో పూర్తిస్థాయి హైకోర్టు ఏర్పడింది. కర్నూలులో కేవలం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి రాయలసీమ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దీనివల్ల జిరాక్స్ మిషన్లు, టైప్ రైటింగ్ వాళ్లకు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాంతాల నుంచి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. సీమపై అభిమానం ఉంటే రాష్ట్ర పరిపాలన రాజధాని కడపలో లేదా ఇడుపులపాయలో పెట్టి సీమపై అభిమానం చాటుకోవాలని కోరారు. ఒకవేళ విశాఖను రాజధానిగా కొనసాగిస్తే మడకశిర ప్రాంతాన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో విలీనం చేయాలని కోరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయాన్ని మానుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి