తాతయ్య ఒడిలో తెలుగుభాష.. అమ్మమ్మ సాంగత్యంలో రామాయణ, మహాభారత కథలు వింటూ పెరిగిన చిన్నారి లక్ష్మీ చౌదరి.. ఇంటర్నేషనల్ భాగవతం ఆణిముత్యాలు సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ పోటీల్లో విశేష ప్రతిభ కనబర్చింది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని గోవింద చౌదరి మనుమరాలు.. అనంతశయన, కీర్తిచౌదరిల ముద్దుల కుమార్తె లక్ష్మీ కర్ణాటక, లలిత సంగీతాలనూ సాధన చేస్తోంది. గురువులు వసుంధర, శ్రీనివాస్ వద్ద సంగీతం నేర్చుకుంటూ.. రామాయణ శ్లోకాలు, పోతన భాగవత పద్యాలపై పట్టు సాధించింది.
అమెరికాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన పుచ్చా మల్లిక్ ఎనిమిదేళ్లుగా ఇంటర్నేషనల్ భాగవతం ఆణిముత్యాలు సంస్థను నిర్వహిస్తున్నారు. ఏటా ప్రపంచంలోని 20 దేశాల పిల్లలకు పోతన భాగవతంపై ఆయన ఆన్లైన్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వయసు ఆధారంగా మూడు విభాగాల్లో ఈ పోటీల నిర్వహణ ఉంటుంది. ఆరు నుంచి తొమ్మిదేళ్ల వయసున్న పిల్లల విభాగంలో లక్ష్మీ చౌదరి అత్యంత ప్రతిభ కనబర్చింది.
ఐబీఏఎం నిర్వహించిన ఈ పోటీల్లో రెండు వేల మంది చిన్నారులు పాల్గొన్నారు. తొలి రౌండ్లో వీడియో రికార్డు చేసి పంపిన రెండు వేల మందిలో 20 దేశాల నుంచి 30 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఒకటిగా నిలిచిన లక్ష్మి తుది రౌండ్ కు ఎంపికైంది. ఇలా మూడు రౌండ్ల పోటీల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. సంస్కృతంలో పద్యం, తెలుగులో తాత్పర్యం చెప్పిన ఐదు మంది అత్యంత ప్రతిభ కనబరిచిన చిన్నారులు ఫైనల్స్ లో గెలుపొందారు. తుది పోటీలో లక్ష్మి చౌదరి ఐదో స్థానంలో నిలిచింది. సంగీతం, చదువులోనూ లక్ష్మీ చక్కని ప్రతిభ చూపుతోందని తల్లి, అమ్మమ్మ తెలిపారు.
ద్వితీయ స్కంధలోని సృష్టికి మూలకారణమైన పరమాత్ముని తత్వాన్ని వివరించే..హరియందు నాకాశ.. పద్యాన్నిపాడి అంతర్జాతీయ పోటీలో మేటిగా నిలచింది. లక్ష్మీ చౌదరికి మరింత మెరుగైన శిక్షణ ఇప్పిచటానికి చిన్నారి తలిదండ్రులు ప్రముఖ సంగీత విద్వాంసులతో ఆన్ లైన్ తరగతులు చెప్పిస్తున్నారు.
ఇదీ చదవండి:phd on chandra babu: చంద్రబాబుపై పీహెచ్డీ చేసిన కృష్ణా జిల్లా వాసి