నిన్నటి దాకా జేబులో ఉన్న పైసలు కొట్టేసే దొంగలు ఉండేవారు. ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో జేబులు వదిలి నేరుగా ఖాతాలనే కొల్లగొడుతున్నారు. ఖాతాలోని నగదు లావాదేవీల కోసం ఏటీఎం కార్డులు, గూగుల్, ఫోన్‌పే తదితర యాప్‌లను వినియోగిస్తున్నారు. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దోపీడీకి పాల్పడుతున్నారు. ఈ ముప్పు ఇటీవల అనంతపురం జిల్లానూ తాకింది. ఎక్కువగా సాంకేతికతపై అవగాహన లేనివారు, మధ్యతరగతి వారే మోసాలకు గురవుతున్నారు.
రూటు మారుస్తున్న కేటుగాళ్లు..
సైబర్ నేరగాళ్లు.. ఇలాంటి మోసాలకు పక్కా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా కొందరిని గుర్తించి.. వారి అవసరాలను, సమస్యలను పసిగడుతున్నారు. వాటి ఆధారంగానే మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో హిందీ లేక ఆంగ్ల భాషల్లో మాట్లాడే వారు. ప్రస్తుతం స్థానిక భాషల్లోనే సంభాషణలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాలు.. వాటి పనితీరు తెలుసుకుంటున్నట్లు కొన్ని ఘటనల్లో స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో సీఎం సహాయ నిధికి దరఖాస్తులు అధికంగా వెళ్తున్న విషయాలను సైబర్ నేరగాళ్లు తెలుసుకున్నారు. ఆ వివరాలను కూడా సేకరించారంటే వారి నెట్‌వర్కింగ్ సిస్టమ్ ఏతరహాలో ఉందో తెలుస్తోంది. బాధితులు.. ఇలాంటి వారిని నిజంగానే అధికారులు అని విశ్వసిస్తుండటంతో.. వారి సూచనలు పాటించి మోసాలకు గురవుతున్నారు.
ఆశల వల.. యువత విలవిల..
లాటరీలో కారు గెలుచుకున్నారని ఈ-మెయిల్, లేక మొబైల్‌కు సమాచారం పంపుతారు. వాటికి సమాధానం ఇచ్చామంటే జేబుకు చిల్లు పడినట్లే. తొలుత కారు విలువలో ఒక శాతం పన్ను చెల్లించాలని చెబుతారు. అది చెల్లించిన తర్వాత మరో 2 శాతం ఇతర పన్నులు అని చెబుతారు. నమ్మే వారు ఉంటే చాలు. కారు విలువలో సగం డబ్బు పన్నుల రూపంలో వసూలు చేస్తారు. పుట్లూరులో అదే తరహాలోనే పదో తరగతి విద్యార్థి మోసపోయాడు. ఇదే తరహాలో కళ్యాణదుర్గంలోనూ ఓ వ్యాపారి మోసపోయాడు. ఎవరైనా మీరు కారు గెలుచుకున్నారని చెప్పినా లేక +92 తరహాలో విదేశీ నెంబర్లతో ఫోన్లు వచ్చినా వాటికి సమాధానం ఇవ్వకపోవడం మంచింది.
రుణాల పేరుతో మోసాలు..
చిన్నపాటి రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. తొలుత సైబర్ నేరగాడు మీరు రూ.3,500 రుణం కావాలంటే ఎలాంటి జామీను లేకుండా ఇస్తామని లింకు పంపుతారు. ఆ లింకు క్లిక్ చేయగానే క్లిక్ చేసిన వ్యక్తి మొబైల్‌లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాడికి వెళ్తుంది. అందులో మొబైల్‌లో ఉన్న కాంటాక్టు నెంబర్ల జాబితా వెళ్లిపోతుంది. తొలుత రూ.3,500 రుణం మంజూరు చేస్తాడు. వారం రోజుల తర్వాత రూ.5 వేలు తిరిగి చెల్లించాలని చెబుతాడు. తర్వాత కాంటాక్టు నెంబర్ల ఆధారంగా అందరికీ మెసెజ్‌లు చేస్తారు. మీ స్నేహితుడు రూ.3,500 రుణం తీసుకున్నాడు. రుణం తీసుకునే క్రమంలో మీ నెంబరును జామీనుగా ఇచ్చాడు అని చెబుతాడు. స్పందించకపోతే న్యాయవాది పేరున లీగల్ నోటీసులు జారీ చేస్తాడు. నోటీసులు, కోర్టులు ఎందుకని భావించిన వారు డబ్బు చెల్లిస్తారు. మొబైల్‌లో వచ్చే అనవసర, సందేహం ఉన్న లింకులను క్లిక్ చేయరాదు.
చిన్నమొత్తాల విచారణ కష్టం
కేటుగాళ్లను పట్టుకోవాలంటే సాంకేతికతతోనే సాధ్యం. రూ.10 వేలు నుంచి రూ.50 వేల లోపు దోచేసిన నేరగాడిని పట్టుకోవడానికి పోలీసులకు వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఏదైనా స్పష్టమైన సాంకేతికత ఆధారాలు ఉంటేనే పట్టుకోవడం సాధ్యం అవుతుంది. నకిలీ చిరునామా, ఆధార్‌తోనే ఖాతాలు తెరచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఖాతాదారులు మెలకువలు, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆశలతో ఎర వేసినా.. తెలివిగా తప్పించుకోవాలి. ఆశపడితే ఖాతాకు చిల్లుపడినట్లే.
రూ. 3.17 లక్షలు కొట్టేశారు
పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన పదో తరగతి బాలుడు మొబైల్‌లో కారు బహుమతిగా వస్తుందని సమాచారం రావడంతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాడు. కారు రావాలంటే కస్టమ్స్ సుంకం చెల్లించాలని నేరగాళ్లు సూచించారు. విద్యార్థి తండ్రి పండ్ల వ్యాపారి. కుమారుడికి ఆన్‌లైన్ క్లాసుల కోసం మొబైల్ ఇచ్చారు. బాలుడు కారు మోజులో పడి 19 పర్యాయాలు మొత్తం రూ.3.17 లక్షలు గూగుల్‌పే ద్వారా చెల్లించాడు. తండ్రి విషయాన్ని తెలుసుకొని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కారు గెలిచారంటూ.. రిజిస్టర్ పోస్ట్
కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ వ్యక్తికి ఆన్‌లైన్ వ్యాపార సంస్థ పేరుతో లక్కీడ్రాలో రూ.14.80లక్షల విలువైన కారు గెలిచినట్లు రిజిస్టర్ పోస్టు వచ్చింది. ఈ నెల 10వ తేదీన కంపెనీ ప్రతినిధిని అని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. కంపెనీ ప్రతినిధి పంపిన బ్యాంకు ఖాతాకు రూ.14,800 పంపాడు. కారు లేక నగదు కావాలంటే కోల్‌కతాకు వచ్చి తీసుకెళ్లాలన్నాడు. లేదంటే అదే ఖాతాకు రూ.44 వేలు పంపాలని సూచించాడు. అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బొమ్మనహాళ్ మండలం శింగానహళ్లిలో సీఎం సహాయ నిధి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.లక్ష దాకా దోచుకున్నారు. తిప్పేస్వామికి ఫోన్ చేసి తాము ఆరోగ్యశాఖ అధికారులమని, మీ ఇంట్లో ఓ వ్యక్తికి కాలు విరగడంతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. డబ్బులు రావాలంటే రూ.2 వేలు మీ ఖాతాలో ఉండాలని చెప్పాడు. తర్వాత మరో రూ.8 వేలు వేయాలని సూచించాడు. ఓటీపీ కనుక్కొని రూ.9 వేలు నేరగాళ్లు డ్రా చేసుకున్నారు. ఇదే తరహాలో ఆరుగురిని మోసం చేశారు.
అప్రమత్తతతోనే అడ్డుకట్ట
అంతర్జాలం వినియోగిస్తున్న వ్యక్తులు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఓటీపీ నెంబర్లు, ఏటీఎం కార్డు వివరాలు ఎవరికీ చెప్పరాదు. ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. వివరాలు చెప్పండి అని అడిగితే స్పందించాల్సిన అవసరం లేదు. కార్డు పని చేయకపోతే బ్యాంకుకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. ప్రభుత్వ పథకాల కోసమని చెబితే ఖాతాల్లోకి డబ్బులు వేయరాదు. పథకాల కోసం ఎవరైనా ఫోన్ చేస్తే ఎదుటి వ్యక్తి ఎవరో తెలియకుండా మాట్లాడరాదు. సంబంధిత కార్యాలయానికి వెళ్లి అధికారులను కలవాలి. సీఎం సహాయ నిధి నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పగానే ఓటీపీ నెంబరు చెప్పడం సరికాదు. బహుమతులు, కారు గెలుచుకున్నారని సమాచారం వస్తే స్పందించరాదు. లింకులను క్లిక్ చేయరాదు. మొబైల్‌లో అవసరం ఉన్నప్పుడే ఇంటర్నెట్ ఆన్ చేసుకోవడం మంచింది. స్మార్ట్ ఫోనులో ఏపీ పోలీసు సేవ యాప్‌ను అందరూ డౌన్‌లోడు చేసుకోవాలి. అందులో సైబర్ నేరాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుపుతారంటు ఎస్పీ సత్యఏసుబాబు వెల్లడించారు
ఇవీ చూడండి...