ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు అనంతపురం జిల్లాలో వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. ఉరవకొండ నియోజకవర్గంలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మిరప, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటలు నీటిలో నానుతున్నాయి. విపనకల్, ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల్లో దాదాపు వెయ్యి హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ ఏడాది మొదట్లో కురిసిన వర్షాలు పంటలకు అనుకూలంగా ఉన్నాయని.. మంచి దిగుబడి చేతికొస్తుందన్న ఆశతో ఉంటే ఇప్పుడు పడుతున్న వానలకు పంటలు పాడయ్యాయని రైతన్నలు వాపోతున్నారు. వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లి పంటలు పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.
ఉరవకొండలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రికార్డు స్థాయిలో 83 మి.మీ. వర్షపాతం నమోదైంది. వజ్రకరూరులో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎన్నడూ లేని విధంగా వర్షాలు రావటంతో వేసిన పంట వేసినట్లే పాడైపోయిందని ఆవేదన చెందారు.
నష్టపరిహారం ఇవ్వండి
అనంతపురం జిల్లా బొమ్మనహాల్, కనేకల్ మండలాల్లో వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ, పత్తి పంటలను మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. దెబ్బతిన్న వేరుశనగ పంటకు ఎకరానికి రూ. 25వేలు, పత్తి పంటకు ఎకరానికి రూ. 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి...