కరోనా కారణంగా మైదానాలు, ఇండోర్ స్టేడియాలు వెలవెలబోతున్నాయి. క్రీడా శిక్షణశిబిరాలు రద్దయ్యాయి. ఆటగాళ్లు ఐదారు నెలల నుంచి రోజువారీ సాధనకు దూరమయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ క్రీడాకారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అరంగేట్రం చేయాలనుకున్న వారి కలలు కల్లలవుతున్నాయి. ఒక్క అనంతపురం జిల్లానే తీసుకుంటే..ఎన్నో తర్ఫీదు కేంద్రాలు, మైదానాలు ఇలా ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
అనంతపురం జిల్లాలో క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 4 అకాడమీ మైదానాలు, 5 ఆర్డీటీ అకాడమీలు ఉన్నాయి. ఇక్కడ హాకీ, ఫుట్‌బాల్, జూడో, క్రికెట్‌పై శిక్షణ ఇస్తున్నారు. కల్యాణదుర్గం, నార్పల, రామగిరి, అనంతపురం ప్రాంతాల్లోనూ ప్రత్యేక తర్ఫీదు కేంద్రాలు ఉన్నాయి. ఏటా జిల్లాలో 11 వేల 500 మంది శిక్షణ పొందుతుంటారు. కరోనా కారణంగా ఆ అవకాశం లేకుండా పోయింది.
తర్ఫీదు కేంద్రాలకు దూరం కావడం వల్ల క్రీడాకారులు మానసిక, శారీరక దృఢత్వం కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.రాష్ట్రంలో హాకీ విభాగంలో అనంతపురం జిల్లాదే అగ్రస్థానం. ఇప్పుడు లీగ్‌లు నిర్వహించక పోవడంపై క్రీడా అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.
కరోనా కారణంగా విద్యాసంస్థలే తెరుచుకోకుంటే క్రీడా మైదానాలు ఎప్పుడు తెరుచుకుంటాయోననే ఆందోళన క్రీడాకారుల్లో వ్యక్తం అవుతోంది.
ఇదీచదవండి