దక్షిణ మధ్య రైల్వేలోని ప్రసిద్ధి గాంచిన స్టేషన్లలో.. అనంతపురం జిల్లా గుంతకల్లు ఒకటి. ఈ మార్గం గుండా వివిధ రాష్ట్రాలకు.. నిత్యం 286 రైళ్లు ప్రయాణించేవి. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రయాణికులు లేకపోవడంతో.. 80 రైళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఫలితంగా రైల్వే ఆదాయం తగ్గిపోయింది. రైల్వే ప్రయాణికుల మీదే ఆధారపడి జీవించే.. పోర్టర్లు, ఆహారం పంపిణీ చేసే కూలీలు, ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఆగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ కూడా తక్కువగానే ఉంటోంది. ఫలితంగా పని దొరక్క రైల్వే కూలీలు, ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోజుకు రూ.800 వరకు ఆదాయం వచ్చేదని... ఇప్పుడు రోజంతా ఉన్నా రూ.150 కూడా రావడం లేదని వాపోతున్నారు. బయట కూడా పని దొరక్క.. కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైల్వే కూలీలు, ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టాక... జులై మొదటి వారంలోగా... పూర్తిస్థాయిలో రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి