ఈసారి ఖరీఫ్‌లో వేరుశనగ రాయితీ విత్తనానికి రైతుల నుంచి స్పందన కరవైంది. ముందస్తుగా వర్షాలు కురిసినప్పటికీ విత్తనం సిద్ధం చేసుకోవాల్సిన రైతులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ లో 2 లక్షల 90 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. కానీ సోమవారం వరకు జిల్లా వ్యాప్తంగా లక్ష 70 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే రైతులు తీసుకున్నారు.
కరోనా భయంతో చాలామంది రైతులు పేర్లు నమోదు చేసుకోటానికి రాలేదు. మూడో దశ కరోనా వ్యాప్తి జరిగితే కూలీల లభ్యత కూడా కష్టమని మరి కొందరు రైతులు భావిస్తున్నారు. ఖరీఫ్ విత్తన పంపిణీ మొదలైనప్పటి నుంచి రైతు భరోసా కేంద్రాల్లో రైతుల సందడి మందకొడిగా ఉంది. ఏటా మూడు లక్షల క్వింటాళ్ల విత్తానాలు పంపిణీ చేసినా.. సరిపోయేదికాదు. అదనంగా పంపిణీ చేయాల్సి వచ్చేది.
కరోనా కారణంగా చాలామంది రైతులు ఇంటి నుంచి బయటకు రావటానికే భయపడుతుండటంతో... ఈసారి ఖరీఫ్ సాగుపై కరోనా ప్రభావం ఉండనుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. రుతుపవనాలు మరో పదిరోజుల్లో వస్తాయనే సంకేతాలు వస్తున్నా ఇతర పంటలకు సంబంధించి విత్తన రాయితీ ధరలను వ్యవసాయశాఖ ప్రకటించలేదు.
ఇదీ చదవండి: