అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆగస్టులో రోజూ సగటున వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గడిచిన ఐదు రోజుల్లోనే 5,362 మందికి నిర్ధరణ కావడం గమనార్హం. బుధవారం ఒక్క రోజే 1,260 మందికి వైరస్ సోకింది. ఇద్దరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 132కు చేరింది. ఇప్పటికే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,667. ప్రస్తుతం కొవిడ్ ఆస్పత్రులు, కేర్ కేంద్రాల్లో, స్వీయ గృహ నిర్బంధంలో 7.262 మంది వైద్య చికిత్స పొందుతున్నారు.
63.14 శాతం మందికి నయం
కేసుల తీవ్రతలో రాష్ట్రంలోనే జిల్లా మూడోస్థానంలో ఉంది. కొన్ని తేదీల్లో అత్యధిక కేసులు జిల్లాలోనే నమోదయ్యాయి. 20 వేల కేసులు దాటిన మూడు జిల్లాల్లో అనంత ఉండటం కలకలం రేపుతోంది. రికవరీ రేటు విషయంలో మాత్రం తూర్పు గోదావరి తర్వాత అనంతపురం రెండో స్థానంలో నిలిచింది. 63.14 శాతం మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మరోవైపు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. 132 మంది మృతి చెందారు. మృతుల సంఖ్యలో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉంది. జూన్ దాకా ఎనిమిది మంది చనిపోగా.. జులైలోనే 106 మంది మృత్యువాత పడ్డారు. ఆగస్టులో ఐదు రోజుల్లోనే 18 మంది తుదిశ్వాస వదిలారు.
పట్టణాల్లో విస్తృతి
మొదటి నుంచి పట్టణాల్లోనే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. అనంత నగరంలోనే దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో ధర్మవరం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, గుత్తి, రాయదుర్గం, పుట్టపర్తి, పెనుకొండ, కళ్యాణదుర్గం, ఉరవకొండ.. తదితర ప్రాంతాల్లో తీవ్రత కనిపిస్తోంది. అనంత, గుంతకల్లు, ధర్మవరంలో వందల్లో కేసులు బయట పడుతున్నాయి. ఉదయం వేళల్లో ఆంక్షలతో కూడిన ప్రజా రవాణా సాగుతోంది. అయితే కొన్ని పట్టణాల్లో తెల్లవారుజామున వ్యాపారాలు విస్తృతంగా నడుస్తున్నాయి. ఈక్రమంలో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది.
ఎక్కడెక్కడంటే..
బుధవారం ప్రభుత్వం వెల్లడించిన బులెటిన్ ప్రకారం జిల్లాలో 1260 మందికి వైరస్ సోకింది. అనంతలో 239, గుంతకల్లు 204, తాడిపత్రి 149, ధర్మవరం 140, పుట్టపర్తి 51, రాయదుర్గం 42, పెద్దవడుగూరు 40, హిందూపురం 39, గుత్తి 32, యాడికి 30, ఉరవకొండ 27, కళ్యాణదుర్గం 24, పెనుకొండ 20, పామిడి 17, యల్లనూరు 16, కొత్తచెరువు 14, ముదిగుబ్బ, పుట్లూరు 13 ప్రకారం, బీకేసముద్రం, కదిరి, నార్పలలో 10 చొప్పున.. ఇలా మొత్తం 53 ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి.
1,596 మంది డిశ్ఛార్జి
కరోనాతో కోలుకుని బుధవారం 1596 మంది డిశ్ఛార్జి అయినట్లు కలెక్టర్ చంద్రుడు తెలిపారు. జిల్లాలోని వివిధ కొవిడ్ ఆస్పత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాల్లో వైద్య చికిత్స పొందుతూ 1596 మంది ఇళ్లకు వెళ్లారు. మరో 14 రోజులపాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని నిర్దేశించారు.
ఇదీ చదవండి: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా వెంకయ్య