అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండల కేంద్రంలో మహిళతో కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధిత కుటుంబ సభ్యులు ఠాణాలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు.
వేధింపులు చర్చనీయాంశం..
చేపల కాలనీలో నివాసం ఉంటున్న సలీమా అనే మహిళ పట్ల స్థానిక ఠాణాలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీరాములు అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా..
ఫలితంగా కాలనీ వాసులు మంగళవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీరాములును చితకబాదారు. బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే కనేకల్ ఠాణాలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారు.
ఎమ్మెల్యే జోక్యం..
వ్యవహారం బయటకు పొక్కడంతో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, కనేకల్ మండల వైకాపా నాయకులు జోక్యం చేసుకున్నారు. కానిస్టేబుల్ తప్పు చేసిన ఘటన పునరావృతం కాకుండా మరో రెండు రోజుల్లో అతన్ని బదిలీ చేయిస్తామని అధికార పార్టీ నేతలు వెల్లడించారు.
దుకాణం వద్దకే..
బాధితురాలు సలీమా కుటుంబం.. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి ఇంటి వద్ద చిన్న కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. గత కొద్ది రోజులుగా శ్రీరాములు వివాహిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దుకాణం వద్ద కూర్చోవడం.. ఆపై తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండేవాడని బాధితురాలు కన్నీరుమున్నీరయ్యారు.
భరించలేక..
ఇక భరించలేక విసిగిన సలీమా విషయాన్ని భర్తకు తెలిపింది. ఈ క్రమంలో చేపల కాలనీలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి బాధితురాలు కానిస్టేబుల్‌కు దేహశుద్ధి చేసి కనేకల్ ఎస్సై సురేశ్‌కు ఫిర్యాదు చేశారు.
తప్పుంటే చర్యలు..
మహిళపై కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయంపై కల్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణను ఈటీవీ భారత్ ప్రతినిధి ఫోన్లో సంప్రదించారు. దీనికి బదులిస్తూ ఈ విషయం తనకు తెలియదని.. ఎస్సై బదులిచ్చినట్లు పేర్కొన్నారు. తప్పు జరిగినట్లు తెలిస్తే సదరు కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : '41 (ఏ)నోటీసు ఇవ్వకపోవటం కోర్టు ధిక్కరణ అవుతుంది'