అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో గర్భిణులు, చిన్నారులకు పంపిణీ చేయాల్సిన సంపూర్ణ పోషణ పాల ప్యాకెట్లు వృథా అవుతున్నాయి. సకాలంలో సరఫరా చేయకపోవడంతో కాలపరిమితి దాటి నేలపాలు అవుతున్నాయి. ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణ లేమి, గుత్తేదారుల ఇష్టారాజ్యం వెరసి ఈ పరిస్థితి నెలకొంది. కాలపరిమితి దాటిపోవడంతో జగనన్న పాల ప్యాకెట్లను బయటపడేశారు. అంగన్వాడి కేంద్రాలకు పంపిణీ చేసే పాల ప్యాకెట్లను మడకశిర పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పాల శీతలీకరణ కేంద్రంలో నిల్వ చేశారు. వాటికి మూడు నెలల గడువు ఉంటుంది.
పాల ప్యాకెట్లను సకాలంలో పంపిణీ చేయాల్సిన గుత్తేదారులు, పర్యవేక్షించాల్సిన అధికారులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పంపిణీకి నోచుకోకుండా సమయం దాటి దుర్వాసన వెదజల్లుతున్న పాల ప్యాకెట్లను గోదాముల బయటపడేశారు. పాడైన పాల ప్యాకెట్లను నిబంధనల ప్రకారం గోతిలో పూడ్చిపెట్టాలి. అలా కాకుండా బయట పడేశారు. పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండీ.. విషాదం: మేకల మేత కోసం చెట్టెక్కిన బాలుడు..పట్టుతప్పి..