అక్టోబరులో వర్షాలు ముగియగానే రహదారుల పనులను మొదలు పెట్టాలని, మళ్లీ వానాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘రహదారుల్ని బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వనరుల సమీకరణకు అనేక చర్యలను చేపట్టాం. ప్రత్యేక నిధి పెట్టాం. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారు. వర్షాలు పడటంతో రహదారులు దెబ్బతిన్నాయి. ప్రతి విషయంలోనూ వక్రీకరణలు జరుగుతున్నాయి. నెగెటివ్ ఉద్దేశంతో ప్రచారం చేసినా...పాజిటివ్‌గా తీసుకుని అడుగులు వేద్దాం. పనులను బాగా చేస్తే నెగెటివ్ మీడియా ఎన్ని రాసినా ప్రజలు గమనిస్తారు’ అని జగన్ పేర్కొన్నారు. రహదారులు, పోర్టులపై మంత్రులు, అధికారులతో క్యాంపు కార్యాలయంలో సీఎం సోమవారం సమీక్షించారు. రహదారుల్ని బాగు చేయటానికి ఎక్కడైనా టెండర్లు పిలవకుంటే వెంటనే ఆ ప్రక్రియను
ప్రారంభించాలని సూచించారు.
వంతెనల వద్ద అప్రోచ్ రహదారులు పూర్తికాక అసంపూర్తిగా ఉండటాన్ని తాను పాదయాత్రలో చాలాచోట్ల చూశానని, వాటిని వెంటనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. నడికుడి- శ్రీకాళహస్తి, కడప- బెంగళూరు, కోటిపల్లి- నరసాపురం, రాయదుర్గ్- తుంకూరు రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
కాకినాడ ఎస్‌ఈజెడ్ పోర్ట్ అభివృద్ధికి అపార అవకాశాలు
పోర్టుల వద్ద కాలుష్యాన్ని నివారించాలని, కొత్తగా నిర్మించే పోర్టుల వద్ద ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాకినాడ ఎస్‌ఈజెడ్ గేట్‌వే పోర్టు అభివృద్ధికి అపార అవకాశాలున్నాయన్నారు. భూమి విస్తారంగా ఉన్నందున పారిశ్రామికాభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని.. దీనికి రోడ్డు, రైలు మార్గాన్ని అనుసంధానం చేయాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. కర్నూలు, కడప విమానాశ్రయాల నుంచి విశాఖపట్నానికి విమానాల రాకపోకలను పెంచాలని.. విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల నుంచి విదేశాలకు సర్వీసులు పెరగాలని సూచించారు.
రహదారులు, పోర్టుల పనులపై అధికారులు ఏం చెప్పారంటే..
- న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్ రుణం రూ.6,400 కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రహదారుల నిర్మాణం.
- అనంతపురం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు మీదుగా బెంగళూరు- విజయవాడ జాతీయ రహదారి నిర్మాణాన్ని ఫాస్ట్‌ట్రాక్‌లో చేపట్టడం.
- 24 నెలల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తి. తొలిదశలో రూ.2,647 కోట్లతో నాలుగు బెర్తుల ద్వారా 25 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు సదుపాయాలు. అక్టోబరు 1 నుంచి పోర్టు పనులు, నవంబర్ మొదటి వారంలో బ్రేక్ వాటర్ పనులు ప్రారంభం. మే నెలకల్లా కీలక పనులు పూర్తి.
- అక్టోబర్ చివరికి భావనపాడు పోర్టు టెండర్ల ప్రక్రియ పూర్తి. మొదటి దశలో రూ.2,956 కోట్లతో మిలియన్ టన్నుల కార్గో రవాణాకు ఏర్పాట్లు.
- మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 14లోగా టెండర్ల ప్రక్రియ ముగింపు. తొలి దశలో 30 నెలల్లో రూ.3,650 కోట్ల వ్యయంతో 35 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు సదుపాయాలు. ఇక్కడి తీర ప్రాంతంలో మట్టి ఎక్కువగా ఉండటంతో ఎలాంటి నిర్మాణ ప్రక్రియను అనుసరించాలన్న దానిపై అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు.
- ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె వద్ద నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ల పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి. రెండో విడతలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, వాడరేవుల వద్ద నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శంకరనారాయణ, గౌతంరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
Inter online admissions: గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపండి: హైకోర్టు