రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల జన్మదినం రోజున ఆయా పార్టీల కార్యకర్తలు హడావుడి చేయటం అన్నిచోట్లా చూస్తుంటాం. కానీ పోలీసు అధికారులు, అదీ విధుల్లో ఉండి పోటీపడి గజమాలలు వేసి, కేకులు తినిపించుకున్న సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది.
పవిత్ర మురిడి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు తప్ప ఇతరత్రా చేయకూడదు. అయితే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పలు ఆలయాల దర్శనానికి వెళ్లి చివరగా డీ హీరేహాల్ మండలం మురిడి ఆలయ దర్శనానికి వెళ్లారు. ముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు చాలాసేపు ఆయన రాకకోసం ఎదురు చూశారు. ఆయన రాగానే పోటీపడి మరీ గజమాలలు వేశారు. ఖరీదైన కేక్ తెప్పించి ఆలయ ఆవరణలోనే తినిపించుకున్నారు.
ఆ తర్వాత రాయదుర్గం ఆర్అండ్ బీ అతిథిగృహానికి వెళ్లిన కాపు రామచంద్రారెడ్డి వెళ్లారు. అక్కడ కూడా పోలీసు అధికారులు పోటీలు పడి పూలదండలు వేసి స్వామి భక్తి చాటుకున్నారు. అతిథి గృహంలో అప్పటికే వేచి చూస్తున్న కార్యకర్తలను పక్కకు వెళ్లమని పోలీసులు ఎగబడి సంబరాల్లో పాల్గొన్నారు.
పోలీసుల అధికారులు ఇలా ప్రజాప్రతినిధుల జన్మదినంలో పాల్గొని సంబరాలు చేసుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఇలా జన్మదిన సంబరాలు చేసుకోవటంపై అక్కడికి వచ్చిన భక్తులు అవాక్కయ్యారు.
ఇదీ చదవండి: DURGA TEMPLE: 'దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించరా?'