Chitravathi Balancing Reservoir Residents Problems: ఎండిన చెట్లు.. ధ్వంసమైన ఇళ్లు.. మొండి గోడలు.. ఇవేమీ తుపాన్ల తాడికి మునిగిన గృహాలు కాదు..! సీఎం జగన్ సొంత జిల్లా ప్రయోజనాల కోసం.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధికారులు ముంచేసిన ఇళ్లు.! చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో (Chitravathi Balancing Reservoir) నీళ్ల వెనుక.. ఈ ఎస్సీ కుటుంబాల కన్నీళ్లున్నాయి.
వైఎస్సార్ జిల్లా తాగు, సాగు నీటి అవసరాల కోసం.. ఉమ్మడి అనంతపురం జిల్లా సరిహద్దులోని తాడిమర్రి మండలంలో.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించారు. 2006లో ప్రాజెక్టు పూర్తైంది. జలాశయ సామర్థ్యం 10 టీఎంసీలుకాగా, 2019 వరకూ ఏటా 5 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు. 2019లో పూర్తిస్థాయిలో నీరు నిల్వచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా.. ముంపు పెరిగింది.
చిత్రావతి ముంపు బాధితులను పట్టించుకోని అధికారులు..
2020లో మర్రిమేకలపల్లిలో పునరావాస ప్యాకేజీకి 529 మంది అర్హులని తేల్చారు. వీరిలో ఇళ్లు కోల్పోయిన 410 మందికి 10 లక్షల చొప్పున.. పరిహారం ఇచ్చారు. మిగిలిన 119 మందికి నేటికీ చిల్లిగవ్వ ఇవ్వలేదు. వీళ్లంతా దళితులే. నా ఎస్సీ అని ప్రతీ సభలో దీర్ఘాలు తీసే జగన్‌కు.. తమ గోడు ఎందుకు పట్టడంలేదన్నదే.. వీళ్ల ఆక్రందన.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంలో.. మర్రిమేకలపల్లితోపాటు సీసీ రేవు, పీసీ రేవు, రాఘవంపల్లి గ్రామాలూ మునిగాయి. కానీ.. పునరావాస ప్యాకేజీ అమల్లో వివక్ష చూపారంటున్నారు మర్రిమేకపల్లి ఎస్సీలు..! రీసర్వే చేసి దాదాపు 200 మందిని కొత్తగా పునరావాస ప్యాకేజీ జాబితాలో చేర్చారు. కానీ.. పరిహారం మాత్రం అందించలేదు. నిరీక్షించి, నీరసించి.. కొందరు నిర్వాసితుల ప్రాణాలు పోయినా ప్రభుత్వంలో చలనం రాలేదు.
పరిహారం కోసం చిత్రావతి నిర్వాసితుల పడిగాపులు
ప్రాజెక్టు కింద ఇళ్లు మునిగిన దళిత కుటుంబాలకు 2010లో.. ఆర్డీటీ సంస్థ సొంత నిధులతో ఇళ్లు నిర్మించింది. అయితే.. ఆయా కుటుంబాలకు 6 లక్షల 75 వేలు మాత్రమే పునరావాస ప్యాకేజి కింద ఇస్తామని అధికారులు మెలికపెట్టేశారు. దానికి ఒప్పుకునేది నిర్వాసితులు ప్రతిఘటించారు. 2020 డిసెంబర్‌లో.. అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడు మర్రిమేకలపల్లి వెళ్లి.. 10 లక్షల పరిహారం ఇప్పిస్తానని మాటిచ్చారు. ఆ మాట కూడా ముంపులోనే కలిసిపోయింది. సొంత జిల్లాకు నీటి ప్రయోజనం చేకూర్చిన జగన్.. తమకు పరిహారం ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని బాధితులు కోరుతున్నారు.
'మర్రిమాకులపల్లి నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి'
"మా ఎస్సీ కాలనీకి 119 మందికి ఒక్క రూపాయి కూడా పడలేదు. పడుతుంది అని చెప్తున్నారు కానీ ఏనాడూ పడలేదు. నాలుగేళ్లుగా తిరుగుతూనే ఉన్నాము. నాలుగేళ్లుగా ప్రతి అధికారి దగ్గరకూ వెళ్లినాము. కానీ మాకు న్యాయం జరగలేదు". - గంగాదేవి, నిర్వాసితురాలు
"మాకు డబ్బులు రాలేదు. చాలా ముందు మందు తాగి చనిపోయారు. న్యాయం చేయడం అని అధికారుల కాళ్లు కూడా పట్టుకున్నాము. కానీ మాకు న్యాయం జరగలేదు. మేము చేసిన తప్పు ఏముంది. నాలుగేళ్లుగా మాకు ఆశ పెడుతూనే ఉన్నారు". - నారాయణమ్మ, నిర్వాసితురాలు