అధికార వికేంద్రీకరణ కాదు... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని ఒక బ్రాండ్‌గా తీర్చిదిద్దితే... ఆ పేరును వైకాపా ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు. అనంతపురంలో సమావేశంలో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాష్ట్రానికే తలమానికంగా, ఉపాధి కల్పన కేంద్రంగా రూపొందిస్తే... వైకాపా నేతలు పూర్తిగా సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు.
పోలీసు వ్యవస్థ నీరుగారిపోతుంది
వైకాపా నాయకులు చెబితేనే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరిగే పరిస్థితి నెలకొందని చంద్రబాబు ఆరోపించారు. నీరు - చెట్టు పనుల బిల్లులు, నరేగా బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయే పరిస్థితి ఉందని మండిపడ్డారు.
సామాజిక న్యాయం కోసం కేటగిరీలు
తెదేపా హయాంలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ వేశామన్న చంద్రబాబు.. జస్టిస్ పున్నయ్య ఆధ్వర్యంలో వాస్తవాల అధ్యయనం చేయించామన్నారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలని ఏ,బీ, సీ, డీ కేటగిరీలు తెచ్చామన్నారు. తెదేపా హయాంలో ఎస్సీలకు న్యాయం జరిగి, ఉద్యోగాలు వచ్చాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం కోసం కేటగిరీలు ఉండాలన్నారు.
మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయలు
ప్రభుత్వ పాఠశాలల్లో .. ఆంగ్లం, తెలుగు రెండూ ఉండాలని కోరుతున్నామని చంద్రబాబు అన్నారు. ఏ భాషలో చదువుకోవాలనేదానిపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. ఏ మాధ్యమం తీసుకోవాలో తల్లిదండ్రులు, పిల్లలు నిర్ణయించుకుంటారన్నారు.
అటువంటి నగరం కోసమే
ఆదాయం తెచ్చేపెట్టే ఓ నగరం ఉంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదే ఆలోచనతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణకు ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం తెచ్చే నగరం అవసరమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఉపాధి కల్పన కేంద్రంగా అమరావతి ఉంటుందనే రైతులు భూములు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.
ఇదీ చదవండి: