తమకు న్యాయం చేయాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు లారీ యజమానులు నిరసన చేపట్టారు. జేసీ ట్రావెల్స్‌లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి విక్రయించారని.. ఆ వాహనాలను రవాణా శాఖ జప్తు చేసిందని ఆరోపించారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన లారీలు జప్తుచేయడంతో పాటు తమపై కేసులు కూడా నమోదుచేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదంటూ జేసీ ప్రభాకర్ ఇంటి ముందు బైఠాయించారు. పట్టణ సీఐ తేజమూర్తి బాధితులను పోలీసు స్టేషన్‌కి తరలించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు, ఎంవీఐ రమణా రెడ్డి బాధితులను విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు జేసీ. ట్రావెల్స్ యజమాని జేసీ. ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా డీఎస్పీ తెలిపారు.
జరిగిందేంటి?
జేసీ. ట్రావెల్స్ ద్వారా దాదాపు 150 టిప్పర్లు, లారీలను తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో రూ.18 కోట్లకు విక్రయించారు. రవాణా శాఖ అధికారులు దర్యాప్తులో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా మార్పు చేశారని గుర్తించి వాహనాలను జప్తు చేశారు. దీంతో లారీ యజమానులు ఆందోళనకు గురై లారీల అమ్మకంలో మధ్యవర్తిగా ఉన్న నాగేశ్వర్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చారు. నాగేశ్వర్ రెడ్డి ఈ విషయాన్ని జేసీ. ట్రావెల్స్ యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. చివరకు లారీ యజమానులు, నాగేశ్వర్ రెడ్డి అంతా కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదట నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి : స్వర్ణాల చెరువు... నిర్లక్ష్యానికి నెలవు