BOY: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలకు చెందిన రామ్మూర్తి, శ్రీలక్ష్మి దంపతుల రెండో కుమారుడు హరీష్ భరద్వాజ్. 2016లో ఈ బాలుడు కండరాల క్షీణత వ్యాధి బారిన పడ్డాడు. అప్పటినుంచి ఆరేళ్ల పాటు ఆసుపత్రుల చుట్టూ తిప్పినా నయం కాలేదు. లక్షల్లో ఒకరి మాత్రమే వచ్చే వ్యాధితో.. ప్రస్తుతం నడవలేని స్థితికి చేరాడు. రెండు కాళ్లు, ఎడమ చేయి పూర్తిగా చచ్చుబడిపోయాయి. చిన్నప్పుడు ఎంతో చురుగ్గా ఉండే హరీశ్ భరద్వాజ్.. వ్యాధి సోకినప్పటి నుంచి చదువుకు, ఆటపాటలకు దూరమయ్యాడు.
రెండేళ్ల కిందట హరీష్ భరద్వాజ్ నాన్న కూడా కాలం చేశారు. దీంతో ఆ కుటుంబం అలనాపాలన కష్టంగా మారింది. ఆ ప్రభావం హరీష్ ఆరోగ్యంపై పడింది. హరీశ్ తండ్రి మరణం తర్వాత ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న అతడి బాబాయి మధుకృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచన పడ్డారు. దీంతో వారి బాధలు మరింత పెరిగాయి.
హరీష్ భరద్వాజ్‌కు ఐదు వేలు, వాళ్ల నాన్నమ్మకు రెండున్నర వేల పింఛను వస్తోంది. ఇదే వీరికి ఆధారం. వైద్య ఖర్చులకు పింఛను మొత్తం కరిగిపోయి.. కుటుంబ పోషణ కష్టమవుతోందని హరీశ్ తల్లి కన్నీటి పర్యంతమవుతున్నారు. తోటి పిల్లలతో ఆడుకోవాలని ఉన్నా.. కాలు కదపలేకపోతున్నానని హరీశ్ భరద్వాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మయదారి రోగంతో చదువుకు సైతం దూరమయ్యానని వాపోతున్నాడు.
చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని మహల్ అనే ఊరిలో హరీష్ భరద్వాజ్‌కు ఆయుర్వేద వైద్యం అందిస్తే నయమవుతుందని కుటుంబీకులు చెబుతున్నారు. అందుకు దాదాపు కనీసం రూ.25 నుంచి 30 లక్షలు అవుతాయని అంటున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే.. హరీశ్ భరద్వాజ్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారవుతారని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: