ఆశల జీవితం ఒక్కసారిగా తలక్రిందులైతే హృదయాంతరాల్లోని భారం... కన్నీళ్లుగా మారి ధ్వనించే మాటలు ఇవి. సాఫీగా సాగిపోతున్న బతుకులో ఉప్పెన లాంటి కష్టం ఎదురైతే మరణమే మేలనిపిస్తుందనటానికి ఈమె మాటలే నిదర్శనం. అనంతపురం జిల్లా తనకల్లులో నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనిత్య కష్టాల కథ... మాటల్లో వర్ణించలేని విషాద గాథ. సునీత, నాగేంద్ర దంపతులకు జన్మించిన శ్రీనిత్య... చదువులో ఎప్పుడూ ముందుండేది. పదో తరగతి, ఇంటర్‌లో పదికి పది పాయింట్లు మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇంజినీరింగ్ తొలి ఏడాది చదువుతుండగా.... విపరీతమైన తలనొప్పి రావటంతో తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేసి అన్నిచోట్లా చూపించారు. చివరకు తలలో కణితి ఉందని శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ అయ్యాక సమస్య పరిష్కారం కాకపోగా... శ్రీనిత్య కంటిచూపు కోల్పోయింది...
కళ్ల ముందే కూలిన కలల సౌధం
కళ్లముందే కన్నబిడ్డ కలలసౌధం కూలిపోతే.... తల్లిదండ్రులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. కలెక్టరై తమను ఆదుకుంటుందనుకున్న కుమార్తె... అంధురాలిగా మారిందనే బాధతో వారు నరకయాతన అనుభవిస్తున్నారు. పేదరికంలో ఉన్నా అప్పుచేసి మరీ వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. వైద్యులెవరైనా తమ కుమార్తెకు కంటిచూపు తెప్పించేలా చూడాలని ప్రాధేయపడుతున్నారు...
ఒక్కతే కూర్చొని ఏడుస్తోంది..
చదువుల్లో చురుగ్గా రాణించే శ్రీనిత్య... నాలుగు నెలలుగా ఇంటికే పరిమితం కావటంతో కాలనీవాసులు సైతం విచారణ వ్యక్తం చేస్తున్నారు. రాత్రిళ్లు సైతం ఆమె నిద్రపోకుండా... చదువుకోవాలని ఉందంటూ కూర్చొని రోదిస్తున్న పరిస్థితి చూసి కలత చెందుతున్నారు
సాయం చేయండి..!
శ్రీనిత్య వైద్యానికి సాయం చేసేవారు ముందుకొస్తారని ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. పోయిన చూపును మళ్లీ తెప్పించే వైద్య నిపుణులు ఎవరైనా కనికరించాలని ప్రాధేయపడుతోంది. దాతలు, వైద్యులెవరైనా యువతిని ఆదుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి. వరద ఉద్ధృతికి పొంగుతున్న పెద్దేరు వాగు