GVL On AP: రాజకీయంగా తమ పార్టీకి ఏమీ చేయని తాము.. ఏపీకి చాలా చేశామని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అనంతపురంలో భాజపా కార్యకర్తల శిక్షణ తరగతులకు హాజరైన ఆయన.. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకాలన్నిటికీ జగనన్న అంటూ పేర్లు పెట్టుకున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రహదారులు తప్ప.., ఒక్కచోట కూడా రాష్ట్ర ప్రభుత్వ రహదారులు లేవని ఆరోపించారు. ప్రత్యేక హోదా అన్నది 2015కు పూర్వమే ఉండేదని, ప్రస్తుతం ఎక్కడా హోదా మాట లేదన్నారు.
MP GVL On Amaravati Capital: రాజధాని అమరావతికి భాజపా మొదటినుంచీ కట్టుబడి ఉందని..జీవీఎల్ అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆ నాడు కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపితే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదన్నారు. రాయలసీమ జిల్లాల నుంచి దశాబ్దాలపాటు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినా.. అభివృద్ధిలో మాత్రం నాలుగు జిల్లాలూ వెనుకబడే ఉన్నాయన్నారు. రాయలసీమ జిల్లాల అభివృద్ధి అజెండాతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోందని జీవీఎల్ స్పష్టం చేశారు.
అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్మాణ పురోగతి లేదన్నదానిపై స్పందించిన జీవీఎల్.. వర్సిటీ ఉపకులపతితో మాట్లాడారు. పది రోజుల్లో డీపీఆర్ పంపిస్తే నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. 44వ నెంబర్ జాతీయ రహదారి అధ్వాన్నంగా ఉందని మీడియా ప్రతినిధులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా..కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. నెలరోజుల్లో పనులు మొదలుపెడుతున్నట్లు జాతీయ రహదారి ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ఎంపీ జీవీఎల్‌కు చెప్పారు.
ఇదీ చదవండి
Political Parties Unity for Amaravati: ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలి.. రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం