అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా గాండ్లపెంటలో హిందూ ఆలయాలపై దాడులను నిరసిస్తూ భాజపా ధర్నా చేసింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు శ్వేతారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు.
హిందూపురంలో..
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో ఒకచోట ఆలయాలపై దాడులు.. విగ్రహాల ధ్వంసం జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కార్యకర్తలు ఆరోపించారు.
హిందూపురం పట్టణంలోని అంబేడ్కర్ కూడలి నుంచి ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తక్షణం దేవదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో..
హిందు ధర్మాల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ ముందు భాజపా నాయకులు నిరసన చేశారు. హిందూ దేవుళ్లు, దేవాలయాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదని నాయకులు ఆరోపించారు. సీఎంకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో..
దేవాలయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలం అయిందని భాజపా నాయకులు కర్నూలులో అన్నారు. దేవాలయాలకు భద్రత కల్పించాలని పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహం ధ్వంసం చేసి తలను సమీపంలోని కొలనులో వేసిన ఘటనలో దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపైనే దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి. లారీలు అడ్డంపెట్టి చంద్రబాబు పర్యటన అడ్డుకుంటారా? పోలీసుల తీరుపై తెదేపా శ్రేణుల ఆగ్రహం