రైతులను ఇంత ఘోరంగా చూస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా లేదని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో రైతులతో కలిసి ప్రజా పాదయాత్ర నిర్వహించారు. ప్రతిపక్షంలో పాదయాత్ర చేసినపుడు సీఎం జగన్ అధికారంలోకి వస్తే హంద్రీనీవా సహా అన్ని రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రాయలసీమ వాడై ఉండి కూడా.. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు అధికంగా ఉన్నా.. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇస్తే సీమను సస్యశ్యామలం చేస్తాం అని చెప్పిన మాటను సీఎం తప్పారని అన్నారు. మాట తప్పడు - మడమ తిప్పడు అని చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని దుయ్యబట్టారు.
ఇక్కడి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక పోవడం వల్లనే ప్రాజెక్టులు ముందుకు పోవడం లేదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు ద్రోహం చేస్తున్న తెలంగాణను గట్టిగా అడగలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. వైకాపా ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.
ఇదీ చదవండి: