AP crime news: రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 12మంది మృతి చెందారు.
మినీ బస్సు బోల్తా.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ప్రమాదంలో మరో 12 మందికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి తిరిగి వస్తుండగా నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ప్రమాదం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు..
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురులంక-యానాం గౌతమి వంతెనపై ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులతో పాటు వారి కుమారుడు మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబం బైక్‌పై కాకినాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సిమెంట్ లారీపై దుండగులు దాడి..
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద సిమెంట్ లారీపై దుండగులు దాడి చేశారు. అర్ధరాత్రి లారీని బైక్‌పై వెంబడించి.. కాల్పులు జరిపారని లారీ డ్రైవర్ తెలిపారు. మరోవైపు రాయితో లారీ అద్దాలు ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
లారీని ఢీకొట్టిన కారు
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం దొమ్మన్న బావి వద్ద ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గుండెపోటుతో..
విజయవాడలోని బస్టాండ్‌లో ప్లాట్ ఫారం నెంబర్ 37 వద్ద ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి సుమారు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. బస్సు ఎక్కెందుకు అక్కడకు చేరుకుని ఫ్లాట్ ఫాం పై ఉన్న బెంచిపై ఒక్కసారీగా కుప్పకూలిపోయాడు. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు 108 కి కాల్ చేయగా వృద్దుడు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి కృష్ణ లంక పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి వృద్దుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా బంగారం
కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద అధికారులు భారీగా బంగారు నగలు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి రాయదుర్గంకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఎలాంటి ఆధారాలు లేకుడా తరలిస్తున్న బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారికి చెందిన రాజేష్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకుని.. అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు 28 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అనుమానంతో..
కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం మాధవరం తండా గ్రామంలో.. ఓ వ్యక్తి తన భార్య మీదున్న అనుమానంతో.. ఉరేసి హత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన విజయ భాయి (32)ని అదే గ్రామానికి చెందిన సుగాలి గోవిందు నాయక్ కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే.. తన భార్య ఇంట్లో వ్యాపారం చేస్తూ.. పక్క గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో.. గోవిందు నాయక్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విజయభాయిని హతమార్చాడు. ఎవరికి అనుమానం రాకుండా మరో గ్రామానికి వెళ్లి మర్నాడు ఇంటికి వచ్చాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన మృతురాలి తల్లిదండ్రులు, స్థానికులు.. గోవిందు నాయక్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
గంజాయి ముఠా అరెస్టు
గంజాయి విక్రయిస్తున్న ముఠాను తిరుపతి నగర పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రేణిగుంట రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు అరుంబాకంకు చెందిన ధనలక్ష్మి, వేసరపాడికి చెందిన ఆనందరాజుతో పాటు తిరుపతి వాసి సురేందర్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి 12 కిలోల గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరులో చోరి కేసు.. నిందితుడి అరెస్టు
గుంటూరు సుద్ధపల్లిడొంక రోడ్డులో. చోరీ కేసును.. 24 గంటల్లోనే పోలీసులు చేధించారు. ఇంటి తలుపులు పగలకొట్టి నిందితుడు చోరీకి పాల్పడినట్లు వారు తెలిపారు. దొంగిలించిన వస్తువులను నిందితుడు పెద్దిరాజు విజయవాడలో అమ్మేందుకు ప్రయత్నం చేయగా.. పోలీసులు పట్టుకున్నట్లు గుంటూరు తూర్పు డీఎస్పీ సీతారామయ్య తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఆర్మీ జవాన్ మృతి
విశాఖ జిల్లా చోడవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఆర్మీ జవాన్ గూనూరు పరమేష్ మృతి చెందారు. సెలవుపై వచ్చిన పరమేష్.. చీడికాడ మండలం వరహాపురం గ్రామంలో జరిగే స్నేహితుడి వివాహానికి మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లారు. వివాహం అనంతరం స్వగ్రామం లక్కవరానికి వచ్చే దారిలో.. అదుపుతప్పి కాలువలో పడ్డారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. ప్రాధమిక చికిత్స అనంతరం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వరుస దొంగతనాలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సంగం మండలాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లల్లో ఎవరు లేని సమయం చూసి.. దోపిడీలకు పాల్పడుతున్నారు. వారం రోజుల వ్యవదిలో.. రెండు మండలాల్లో ఎనిమిది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వరుస అపహరణలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
రెండు ద్విచక్రవాహనలు ఢీ.. విద్యార్థి మృతి
కృష్ణాజిల్లా గుడివాడ నందివాడ మండలం జనార్ధనపురం వద్ద.. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు విద్యార్థులు కింద పడిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న లారీ.. ఓ విద్యార్థి పై నుంచి దూసుకెళ్లటంతో అక్కడికక్కడే మరణించాడు. మరో విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహిళ అనుమానస్పద మృతి
ప్రకాశం జిల్లా చీరాలలోని హరిప్రసాద్ నగర్ లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హరిప్రసాద్ నగర్ లో నివాసం ఉంటున్న కుమ్మా రాఘవమ్మ(55) ఇంట్లో మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనస్థలానికి చేరుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. మహిళ మోకాళ్లపై తీవ్రగాయాలున్నట్లు తెలిపారు. భర్త ఇంట్లో లేకపోవటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం గణేష్ కాలనీకి చెందిన పండ్ర వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. పాత సామాన్లు కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శనివారం ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చిన వెంకటేశ్వరరావు.. భార్య కు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్లు చెప్పాడు. దీంతో అతని భార్య.. బంధువుల సాయంతో వెతకడం ప్రారంభించిన ఆచూకీ తెలియలేదు.
ఆదివారం ఉదయం ఫాతిమాపురం గ్రామంలో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ సమీపంలో.. అతని ద్విచక్ర వాహనం కనబడటంతో ఆ పరిసరాల్లో వెతకడం మొదలు పెట్టారు. కాలువలో వెంకటేశ్వరరావు ధరించిన దుస్తులు ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు.. కాలువలో వెతకడంతో వెంకటేశ్వరరావు మృతదేహాన్ని కనుగొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతలపూడి ఎస్సై స్వామి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి :
తూర్పుగోదావరి జిల్లాలో బైక్‌ను ఢీకొన్న వ్యాన్... ముగ్గురు మృతి