మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, ప్రజల్లో అనంతపురం, ప్రకాశం జిల్లాలవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను పోలీసులు చేపట్టారు. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు పాఠశాలలు, వీధులు, రద్దీ ప్రాంతాలు, గ్రామాల్లో యాంటి డ్రగ్స్ పై చైతన్యం కల్పించారు. డ్రగ్స్ నేరుగా మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. వాటిని వాడే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థలపైనా దుష్ప్రభావాలు చూపుతాయని వివరించారు. శరీరంలో ప్రధాన అవయవాలైన గుండె, మెదడు, లివర్, ఊపిరితిత్తుల పని తీరు మందగించే ప్రమాదం ఉందని తెలిపారు.
మత్తు పదార్థాలకు అలవాటుపడితే... రక్తనాళాలు కుంచించుకుపోవడం, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడటం, జ్ఞాపకశక్తి క్షీణించడం, ఏకాగ్రత లోపించడం, పక్షవాతం రావడం, తదితర దుష్ఫరిణామాలు తలెత్తి జీవితం నాశనమయ్యే ప్రమాదముందని సూచించారు. మాదకద్రవ్యాలు వాడటం వల్ల శరీరంపై నియంత్రణ కోల్పోయి... విచక్షణారహితంగా ప్రవర్తించేలా చేస్తుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల జోలికెళ్లకూడదని తెలిపారు. ఈ అవగాహనా కార్యక్రమాలతో పాటు అనుమానిత దుకాణాలు, మందుల షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.