అనంత అర్బన్ సీటు
ప్రభాకర్ చౌదరి గత ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి తెదేపా తరపున గెలుపొందారు. ప్రజారాజ్యం నుంచి తెదేపాలోకి వచ్చిన ఆయన..కాంగ్రెస్ కంచు కోటలో తెదేపా జెండా ఎగరేశారు. గతంలో మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేసిన చౌదరికి కాపులు, మైనార్టీల, వ్యాపారస్తులు, ఇతరుల మద్దతు బాగానే ఉంది. కానీ తమ పార్టీకే చెందిన మేయర్ స్వరూప, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిలతో ప్రభాకర్ చౌదరికి అంత సఖ్యత లేదు. వీరి మధ్య ఉన్న విభేదాల వలనే జిల్లా కేంద్రం అభివృద్ధిలో వెనుక బడిందని అనంత వాసుల అభిప్రాయం. మరోసారి అనంతపురం సీటును ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గెలుపుకు..ఆ పార్టీ నేతల మద్దతు అవసరమే అంటున్నారు విశ్లేషకులు.
అనంతపురం అర్బన్ సీటు కోసం పారిశ్రామిక వేత్త సురేంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హంద్రీనీవా ప్రాజెక్టు కాంట్రాక్ట్ పొందిన సురేంద్ర, తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి సీఎం మన్ననలు పొందారు. రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్న ఆయన అనంత అసెంబ్లీ సీటు కోసం పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. తెదేపా నుంచి సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.
అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల 25 వేల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో తెదేపాకు ఈ స్థానం కీలకమైనది. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి నగరంలో కాపు, వైశ్య, ముస్లిం మైనార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యాపారస్తులు చౌదరికే అనుకూలంగా ఉన్నారు. ఈ అనుకూలంశాలతో ప్రభాకర్ చౌదరి గెలుపు శాతం ఎక్కువే అంటున్నారు. ఒకవేళ ప్రభాకర్‌కు సీటు లభించకపోతే తెదేపా అభ్యర్థి ఓటమికి పనిచేస్తామని ఆయన వర్గీయులు హెచ్చరిస్తున్నారు.
పాతారు వివాదం
అనంతపురం పాతూరు రోడ్ల విస్తరణ అధికార పార్టీ నేతల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. పాతూరు రోడ్ల విస్తరణ చేపట్టాలన్న అంశంపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య మాటాలు యుద్ధమే జరిగింది. విస్తరణ పనులకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని.. ఎంపీ,.. జేసీ దౌర్జన్యం చేస్తే ఒప్పుకోమని ప్రభాకర్ రెడ్డి.. ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకున్నారు. రాజకీయ రంగు పులుముకున్న పాతూరు రోడ్డు విస్తరణ పనులు నేటికీ ముందుకు సాగడంలేదు.
జిల్లాలో సీట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత అభిప్రాయాలు తీసుకుంటే ప్రభాకర్ చౌదరికి అనంత అర్బన్ సీటు దక్కడం కష్టంగానే ఉంది. ఒకవేళ ప్రభాకర్ చౌదరికే సీటు కేటాయిస్తే...ఇతర నేతల మద్దతును ప్రభాకర్ చౌదరి కోరాల్సివస్తుంది. ఈ తరుణంలో నేతలు తమ మధ్య విభేదాలు మరిచి ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలిపితే ఆయన గెలుపు తథ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.