ఈ ఘటన.. పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనం. అనుమానాన్ని మించిన ఉన్మాదం. పదిహేనేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని మరిచిపోయేలా చేసిన కిరాతకం. అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఆంథోనీ కాలనీలో ఈ అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడైన రజాక్ కు.. అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఈ క్రమంలో.. తన భార్య ఎవరితో మాట్లాడినా రజాక్ అనుమానపడేవాడు. ఇదే విషయంపై తరచూ గొడవలు జరిగి.. గతంలోనూ ఓ సారి రజాక్.. షర్మిలపై దాడి చేశాడు. పుట్టింటికి వెళ్లిపోయిన షర్మిల.. చివరికి కొన్నాళ్ల క్రితం మళ్లీ భర్త దగ్గరికి చేరింది. అప్పుడు కూడా మరోసారి ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. పరాయి పురుషులతో మాట్లాడబోనని కాగితంపై రాసి ఇస్తేనే ఇంట్లో ఉండు.. అని రజాక్ అల్టిమేటమ్ ఇచ్చేశాడు. అందుకు అంగీకరించని షర్మిలపై.. రజాక్ హత్యాయత్నానికి ఒడిగట్టాడు.
ఆవేశంలో విచక్షణ కోల్పోయిన రజాక్.. ఇంట్లో ఉన్న కత్తితో షర్మిల మెడపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను.. కుటుంబీకులు గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం.. అనంతపురంలోని ఆసుపత్రిలో చేర్పించారు. రజాక్ ప్రవర్తనపై బాధితురాలి కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
'నవ్వుల టానిక్'తో.. అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతున్న డాక్టర్..!