చూసేందుకు అమాయకంగా కనిపిస్తున్నా... మైదానంలో అడుగుపెడితే మాత్రం చిచ్చర పిడుగే. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రాజేశ్వరాచారి, సునీత దంపతుల కుమారుడు హర్షవర్ధన్. ఓ రోజు సరదాగా అనంతపురంలోని పీటీసీ క్రీడా మైదానానికి హర్షవర్ధన్ వెళ్లాడు. అక్కడ స్కేటింగ్ నేర్చుకుంటున్నవారిని చూసి ఆటపై మక్కువ పెంచుకున్నాడు. తానూ నేర్చుకుంటానని ఇంట్లో పట్టుబట్టాడు. పేద కుటుంబమైన కుమారుడి కోరికను కాదనలేకపోయారు తల్లిదండ్రులు. స్కేటింగ్ శిక్షణలో చేర్పించారు.
బుడతడు... దూసుకెళ్తున్నాడు
నాలుగు నెలల్లోనే మిగిలినవారి కంటే హర్షవర్ధన్ ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న విషయాన్ని గమనించిన శిక్షకుడు... బాలుడి విన్యాసాలను ఎప్పటికప్పుడు చిత్రీకరించి తిరుపతిలోని స్కేటింగ్ అకాడమీ కోచ్ ప్రతాప్‌కు పంపించాడు. అక్కడ చోటుదక్కేలా చేశాడు. అంతే అప్పటినుంచి ఆ బుడతడు వెనదిరిగి చూడలేదు. స్కేటింగ్ అద్భుత నైపుణ్యంతో దూసుకుపోతూ సత్తా చాటుతున్నాడు.
క్లిష్టమైన 'లింబో'... అయినా అవలీలగా...
స్కేటింగ్ క్రీడలో అత్యంత కష్టమైన విన్యాసం 'లింబో'. ఇందులో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల సంఖ్య అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చాలా తక్కువ. ఈ విన్యాసంలో శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచాల్సి ఉంటుంది. కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రమాదకర విన్యాసాలను సైతం హర్షవర్ధన్ అవలీలగా... మెరుపు వేగంతో చేస్తున్నాడు. కఠోర శ్రమకు ఫలితంగా... అత్యుత్తమ ప్రదర్శనతో ఇప్పటికే 15కి పైగా పతకాలు సాధించాడు.
ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో...
ఇప్పటికే అనేక పతకాలు సాధించిన చిన్నారి హర్షవర్ధన్... ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలోనే ఉన్నాడు. ప్రపంచ స్థాయి లింబో స్కేటింగ్‌లో కేవలం 7.2 సెంటీమీటర్ల ఎత్తు నుంచి దూసుకెళ్లడమే ప్రపంచ రికార్డుగా ఉంది. అయితే ఇదే ఎత్తులోనే ఫైరింగ్‌లో లింబో చేసేందుకు హర్షవర్ధన్ ఉత్సాహం చూపిస్తున్నాడు. దీనికి అనుగుణంగా తర్ఫీదు ఇచ్చే పనిలోనూ శిక్షకులు నిమగ్నమయ్యారు. హర్షవర్ధన్ ప్రతిభ, ఉత్సాహం చూసి తమకు ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ప్రతిభకు కాస్త ఆర్థిక సహకారం అందితే మరిన్ని విజయాలు సాధిస్తాడని అంటున్నారు.
చిన్నవయసులోనే స్కేటింగ్‌లో ప్రతిభ చాటుతున్న హర్షవర్ధన్‌కు... మరిన్ని మెళకువలు నేర్పిస్తే దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెస్తాడు అనటంలో సందేహం లేదు. అందుకు తగినట్లుగానే కఠోర శ్రమ చేస్తున్న బాలుడు లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిద్దాం.
ఇవీ చూడండి-'అన్నగారిపై అభిమానం... మార్చాడు బుల్లెట్ అవతారం'