అనంతపురం నగరపాలక సంస్థలో ఎన్నికల పోరు ముమ్మరమైంది. మూడు లక్షల మేర జనాభా ఉన్న నగరాన్ని 50 డివిజన్లుగా విభజించారు. 2005లో నగరపాలక సంస్థగా మారిన అనంతపురం.. తొలిసారి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్‌కు చెందిన బీసీ నేత పరశురాం దక్కించుకున్నారు. రెండోసారి తెలుగుదేశం విజయబావుటా ఎగురవేసింది. కమ్మ వర్గానికి చెందిన నేత స్వరూప మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. మూడోసారి ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తే మేయర్ కూర్చీపై కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రతిదీ స్వయంగా చూసుకుంటున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి... అన్ని వర్గాలకూ వైకాపా ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించారు. నగరంలోని ప్రముఖ కంటి అద్దాల దుకాణ యజమాని వాసీంను పార్టీలోకి తీసుకుని కార్పొరేటర్‌గా నిలబెట్టారు. మొత్తంగా 8 మంది ముస్లింలను పలు డివిజన్లలో బరిలో నిలిపారు. ఈ పరిణామాలు చూస్తుంటే ముస్లింనే వైకాపా మేయర్‌గా ఎన్నుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశమూ ముస్లింనే మేయర్‌గా ఎన్నుకుంటామని స్పష్టం చేసింది. తాము ఎక్కువమంది మైనార్టీలకు సీట్లు ఇవ్వాలని నిర్ణయించామని.. వైకాపా వాళ్లే బలవంతంగా ఏకగ్రీవాలు చేసి ఆ అవకాశం లేకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తెలిపారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న డివిజన్లలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన.. మైనార్టీలకే మేయర్ అంటూ హామీ ఇస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలను, సామాజిక వర్గాల వారీగా నేతలను కలుస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు రెండు ప్రధాన పార్టీలూ యత్నిస్తున్నాయి.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శనివారం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ప్రధాన పార్టీలు ముస్లింలకు మేయర్ పీఠాన్ని ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటున్నాయి.
ఇదీచదవండి.