Anantapur road widening works: అనంతపురం నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి .. పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు రహదారిని విస్తరించాలని.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి నుంచి బళ్లారి రహదారిని కలుపుతూ వాణిజ్య పరంగానూ నగరాన్ని అభివృద్ధి చేయాలనేది ఉద్దేశం. మొత్తం 9.2 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మించడానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ నిధులు మంజూరు చేసింది. మొత్తం 310 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. అనంతపురానికి చెందిన గుత్తేదారు 27 శాతం తక్కువతో 272 కోట్ల రూపాయలకు పనుల్ని దక్కించుకున్నారు. పనుల్ని ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్ట్- ఈపీసీ పద్ధతిలో అప్పగించారు.
9.2 కిలోమీటర్ల రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా డ్రైనేజీ, నడక ట్రాక్ నిర్మాణం చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, భవనాలు తొలగించి.. పరిహారం అందించారు. భూసేకరణ విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. స్థానిక వైయస్ఆర్సీపీ నాయకుల భవనాలు, దుకాణాల వద్ద రోడ్డును మలుపులు తిప్పారనే విమర్శలు వస్తున్నాయి. పలుకుబడి, రాజకీయ అండ ఉన్నవారి నిర్మాణాలకు నష్టం జరగకుండా.. దారి అలైన్‌మెంట్ మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పనులు చూస్తే ఆరోపణలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఓ వైయస్ఆర్సీపీ నాయకుడి భవనాల వద్ద వెడల్పు తగ్గడం, అవతలి వైపు పెరగడం వంటివి.. అక్రమాలను బహిర్గతం చేస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బళ్లారి బైపాస్ పైవంతెన సమీపంలో.. ఓ ప్రైవేటు రెసిడెన్సీ వద్ద రోడ్డు మలుపులు తిరగడంపై.. విశ్రాంత ఏస్పీ. బాలనర్సింహారెడ్డి.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఆ భవనం యజమానితో ముడుపులు తీసుకుని.. రోడ్డును మళ్లించారని ఫిర్యాదు చేశారు. సప్తగిరి సర్కిల్ సమీపంలో పాత రోడ్డు ప్రకారం మలుపులు లేవు. కానీ కొత్తగా నిర్మించిన రోడ్డు చివర అనేక మలుపులు తిరగడం అనేక విమర్శలకు తావిస్తోంది. అలాగే.. సుభాష్‌రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జి వద్ద రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. పాత డ్రైనేజీకి ఇవతలే కొత్తగా కాలువ నిర్మాణం చేపట్టారు. విస్తరణలో భాగంగా మరింత వెడల్పు కావాల్సిన కాలువ.. ఇక్కడ మాత్రం కుదించుకుపోయింది. దీనికి తోడు కల్వర్టుకు అటువైపు డ్రైనేజీ వెడల్పు 8 అడుగులు ఉండగా.. ఇటువైపు 5.8 అడుగులే ఉంది. ఎవరి ప్రయోజనం కోసం వెడల్పు తగ్గించారనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది. దీనికి సమీపంలోనే రిలయన్స్ డిజిటల్ వద్ద ఎడమవైపు రోడ్డు వెడల్పు 42 అడుగులు ఉండగా... కుడివైపు 46 అడుగులు ఉంది. ఉద్దేశపూర్వకంగానే.. ఎడమ వైపు వెడల్పు తగ్గించినట్లు అర్థమవుతోంది.
అర్బన్ లింకురోడ్డు విస్తరణ పనుల్ని.. ఆర్ అండ్ బీ శాఖలోని నేషనల్ హైవే విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనుల్ని పర్యవేక్షించాల్సిన అధికారులు.. నిర్లక్ష్యం వహించారు. అవకతవకలు కనిపిస్తున్నా.. చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు బాధితుల ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. విస్తరణపై కోర్టులో 20 వరకు కేసులు పెండింగులో ఉన్నాయి. అధికారులు మాత్రం.. పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని... అర్బన్ లింకురోడ్డు విస్తరణలో అవకతవకలకు ఆస్కారమే లేదంటున్నారు. ప్రభుత్వం ఆమోదించిన అలైన్‌మెంట్ ప్రకారమే విస్తరణ జరుగుతోందని.. దీనిపై గతంలో వచ్చిన ఫిర్యాదులకు కూడా వివరణ ఇచ్చామని చెబుతున్నారు. పనుల్ని నిలిపివేయాలని కోర్టు ఆదేశించలేదంటున్నారు.
ఇవీ చదవండి: