Anantapur Police on Contractors Kidnap : కోల్‌కతాకు చెందిన కాంట్రాక్టరు సర్వర్ జహన్ ది లోటస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ పేరుతో అనంతపురం జిల్లా కొడిమి వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనుల్ని దక్కించుకున్నారు. కోల్‌కతా నుంచి కూలీలను తెప్పించి పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో తనకు కమీషన్ ఇవ్వాలంటూ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి బెదిరించారంటూ సర్వర్ జహన్ ఆరోపిస్తున్నారు. తాను ఒప్పుకోకపోవడంతో తన వద్ద పని చేస్తున్న 9 మంది కూలీలను బంధించారని శుక్రవారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు, ఉదయం 11 గంటల సమయంలో కలెక్టర్ గౌతమికి మెయిల్ చేశారు.
Raptadu MLA Thopudurthi Prakash Reddy Controversy : ఈ విషయంపై ఎవరూ స్పందించకపోవడంతో పశ్చిమబెంగాల్ ఎంపీ ఎ.హెచ్.ఖాన్ చౌదరిని ఆశ్రయించారు. ఆయన దీనిపై అనంతపురం కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. అప్పటికీ స్పందించకపోవడంతో శనివారం ఉదయం న్యాయవాదిని ఎస్పీ దగ్గరకు పంపించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ సర్వర్ జహన్ ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, అనంతపురం కలెక్టర్, ఎస్పీ, అనంతపురం రూరల్ సీఐలను ప్రతివాదులుగా చేర్చారు.
డబ్బులివ్వాలని జగనన్న లేఔట్ గుత్తేదారునికి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
రెండ్రోజులు నిర్బంధం : కోల్‌కతా కూలీలను నిర్బంధించేందుకు అనంతపురం గ్రామీణ పోలీసులు పూర్తిగా సహకరించినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి కొడిమి జగనన్న కాలనీలో పని చేస్తున్న కూలీలు తమ రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో ఓ కానిస్టేబుల్ వచ్చి వారిని అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలుకు తీసుకెళ్లారు. వారిని అక్కడే రెండ్రోజులపాటు నిర్బంధించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాక్రీట్ సంస్థలో పని చేస్తున్న ఓ వ్యక్తి ఈ వ్యవహారం మొత్తం నడిపించినట్లు సమాచారం.
వైఎస్సార్సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!
వాంగ్మూలాన్ని నమోదు చేయని అధికారులు : కూలీలను ఎమ్మెల్యే నిర్బంధించారంటూ మీడియాలో వార్తలు రావడంతో వైఎస్సార్సీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. పోలీసుల సహకారంతో ఫంక్షన్ హాలులో నిర్బంధించిన కూలీలను శనివారం ఉదయం హుటాహుటిన కొడిమిలోని జగనన్న లేఅవుట్‌కు తరలించారు. కాంట్రాక్టరు తరఫున న్యాయవాది ఫిర్యాదు చేసే వరకు పోలీసులు స్పందించలేదు. అనంతపురం గ్రామీణ డీఎస్పీ శివారెడ్డిని, ఇద్దరు అసిస్టెంటు లేబర్ ఆఫీసర్లను విచారణ కోసం కొడిమికి పంపించారు.
అప్పటికే అనంతపురం గ్రామీణం పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు కూలీలను బెదిరించి తమను ఎవరూ బంధించలేదని విచారణలో చెప్పాలని తెలిపారు. అయినా పదో తేదీ రాత్రి ఓ కానిస్టేబుల్ వచ్చి తమను తీసుకెళ్లారని అనరుల్ మొమిన్ అనే కూలీ విచారణకు వచ్చిన ఇద్దరు అసిస్టెంటు లేబర్ ఆఫీసర్లకు తెలియజేశారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయలేదు. తమను ఎవరూ నిర్బంధించలేదంటూ తెలుగులో రాసి వారితో సంతకాలు, వేలిముద్రలు తీసుకుని విచారణ ముగించారు. అనంతపురం గ్రామీణ డీఎస్పీ శివారెడ్డి సైతం వాస్తవాలను పక్కనపెట్టి కూలీలను నిర్బంధించడం అవాస్తవమని పేర్కొన్నారు. కార్మికులను నిర్బంధించారని వచ్చిన ఆరోపణలను రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ఖండించారు.
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు పాగా వేస్తున్న వైసీపీ నాయకులు- ఏకంగా కార్యకర్త భూమినే కబ్జా