అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూత్‌లలో ఎలక్ట్రికల్ పరికరాలు అమర్చడానికి 32 లక్షల నిధులతో చేసే పనిని లాల్ బాషతో పాటు మరో ఐదుగురికి ప్రభుత్వం అప్పగించింది. దీనికి సంబంధించిన బిల్లు మొత్తాన్ని జిల్లా పరిషత్ ఇంజినీరింగ్ విభాగం నిధుల నుంచి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. తొలి విడతగా 20 లక్షల రూపాయలు చెల్లించటానికి జడ్పీ ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్, కార్యాలయంలోని మరికొందరి ఉద్యోగులు 25 వేల 500 రూపాయల లంచం డిమాండ్ చేశారు.
ఈ మొత్తాన్ని గుత్తేదారు నుంచి వసూలు చేసి ఇచ్చేలా సూపరింటెండెంట్ రబ్బానికి బాధ్యత అప్పగించారు. గుత్తేదారు నుంచి రబ్బాని సప్తగిరి కూడలిలో డబ్బు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. రబ్బాని నుంచి 25,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు అనిశా కోర్టులో హాజరుపరుస్తామని అనిశా అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:
అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థపై సీఎం జగన్ సమీక్ష