Manoj Complaint to Mohan Babu Versity Incident : బుధవారం నాడు మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. తనతో పాటు, భార్య మోనికపైనా దాడి చేశారని అందులో పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు చెప్పారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తనను అభిమానంగా ప్రేమిస్తున్న వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తనతో మాట్లాడాలని, తాను ఎక్కడికీ పారిపోవడం లేదన్నారు. చెట్ల వెనక నుంచి తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తన అభిమానులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తాను ప్రతి సంక్రాంతికి వస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు జరిగిన విషయాలను తాను ఎవరితోనూ చర్చించలేదని మనోజ్ వెల్లడించారు.
"నాతో పాటు భార్య మౌనికపైనా దాడి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారు. నాకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదు. ఏదైనా సమస్య ఉంటే నాతో మాట్లాడాలి. నేను ఎక్కడికి పారిపోవడం లేదు. చెట్ల వెనక నుంచి మాపై దాడులు చేస్తున్నారు. నా అభిమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు." - మంచు మనోజ్, సినీ నటుడు
అసలేం జరిగిదంటే : మంచు మోహన్‌బాబు కుటుంబంలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. బుధవారం నాడు తిరుపతి సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. భార్య మౌనికతో కలిసి మనోజ్ వర్సిటీకి చేరుకోగా, పోలీసులు గేటు బయటే వారిని అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విశ్వవిద్యాలయం లోపలికి వెళ్లేందుకు అనుమతులు లేవని ఆయనకు చెప్పారు. దీంతో పోలీసుల నుంచి నోటీసులు అందుకొని మనోజ్ వెనుదిరిగారు.
ఆ తర్వాత మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మనోజ్ దంపతులు మరోసారి వర్సిటీ వద్దకు రాగా అనుమతిలేదని పోలీసులు అడ్డుకున్నారు. తాత, నాన్నమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నానని ఆయన పోలీసులకు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల రీత్యా మనోజ్ వర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని వారికి మరోసారి చెప్పారు. తాత, నాన్నమ్మ సమాధుల వద్దకు వెళ్లేందుకు ఎవరి అనుమతీ అక్కర్లేదంటూ మనోజ్ పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం సీఐతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత మనోజ్‌ను పోలీసులు సమాధుల వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి మనోజ్ దంపతులు వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
‘జనరేటర్‌లో పంచదార - నిలిచిన విద్యుత్ సరఫరా' - మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవ