A mothers daughter killed in a road accident: అప్పటివరకు అందరితో ఆనందంగా గడిపిన ఆ కుటుంబ సభ్యులలో ఇద్దరిని బస్సురూపంలో మృత్యవు దూరం చేసింది. కుటుంబసభ్యులతో జాతరకు వెళ్లి తిరగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గం మండలం రాతిబావివంక తండాకు చెందిన గంగాధర్ నాయక్, అతని భార్య రుక్మిణీబాయి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిందట అనంతపురానికి వలసవెళ్లారు. రాంనగర్లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయిస్తూ, ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నారు. స్వగ్రామంలో మారెమ్మ జాతర జరగటంతో ఆటోలో వెళ్లారు. బంధువులతో కలిసి కుటుంబ సభ్యులంతా జాతరను సంతోషంగా జరుపుకొన్నారు. తిరుగుప్రయాణ సమయంలో కళ్యాణదుర్గం - రాయదుర్గం జాతీయ రహదారిపై రమణేపల్లి గ్రామ సమీపంలో బళ్లారికి వెళుతున్న కళ్యాణదుర్గం ఆర్టీసీ డిపో బస్సు ఆటోను ఢీకొంది. దీంతో ఘటన స్థలంలోనే ఆ దంపతుల చిన్న కుమార్తె జ్ఞానేశ్వరిబాయి (5) మృతి చెందింది. రుక్మిణీబాయి, గంగాధర్ నాయక్, వారి పెద్ద కుమార్తె హరిప్రియ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించే ప్రయత్నం చేస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రుక్మిణీబాయి (36) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందటంతో.. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్.ఐ. రుషేంద్రబాబు ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: