అనంతపురం జిల్లా రాయదుర్గం గ్రామీణ మండలం 74 ఉడేగోళం గ్రామంలో తండ్రి కొడుకులే 40 ఏళ్లపాటు సర్పంచులుగా కొనసాగి చరిత్ర సృష్టించారు. 1956లో గ్రామ పంచాయతీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి శరణప్ప, ఆయన కుమారుడు తిప్పేస్వామి 1996 వరకు సర్పంచులుగా వ్యవహరించారు. తండ్రి పదేళ్లు, కుమారుడు 30 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. నాలుగుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం తిప్పేస్వామి ఎంపిక చేసిన ఇద్దరు సర్పంచులుగా వ్యవహరించారు.
మాటకు విలువ...
నాలుగు దశాబ్దాలకాలంలో గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా, ఏ పార్టీని ఆదరించాలన్నా అప్పట్లో శరణప్ప, తిప్పేస్వామి మాటకు విలువ ఇచ్చేవారు. గ్రామస్థులంతా సంఘటితంగా నిర్ణయాలు తీసుకునేవారు. రిజర్వేషన్ల ప్రకారం ఇతరులకు సర్పంచిగా అవకాశం వచ్చినా, వార్డు సభ్యులను ఎంపిక చేయాలన్నా వారిమాటే వేదవాక్కుగా ఉండేది. గ్రామ సమస్యలను పోలీస్‌స్టేషన్ల దాకా వెళ్లకుండా స్థానికంగానే పరిష్కరించేవారు.
ప్రగతి పనులు చేపట్టి...
1962లోనే పంచాయతీ భవనాన్ని నిర్మించారు. మూడు తాగునీటి ట్యాంకులు, సిమెంట్ రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, పక్కాగృహాలు, ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారు. గ్రామంలోనే ఆర్డీటీ కార్యాలయం ఏర్పాటుకు సహకరించారు. 74.ఉడేగోళం గ్రామం ఉత్తమ పంచాయతీగా రెండుమార్లు, ఉత్తమ సర్పంచిగా ఒకసారి పురస్కారాలు సైతం అందుకున్నారు. తండ్రి, కొడుకుల మరణం తర్వాత తెదేపాకు చెందిన గురుసిద్ధప్ప గ్రామస్థుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: తొలివిడత నామినేషన్లు: కొన్ని చోట్ల ఒప్పందాలు.. మరికొన్ని ప్రాంతాల్లో విభేదాలు