తెలంగాణలో జరిగిన ఓ ఘటన సమాజంలో పతనమవుతున్న విలువల్ని తెలియజేస్తోంది. వివాహేతర సంబంధాలు విషాదాలను మిగులుస్తాయనేందుకు ఉదాహరణగా మారింది. ఓ మహిళ సాగించిన చెడు సంబంధం ఏకంగా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. తాత్కాలిక సుఖం కోసం అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంది ఆ వివాహిత.
రాసలీలలు.. తీశాయి ప్రాణాలు
తెలంగాణలోని యాదాద్రి భువనగిరికి చెందిన సూరనేని కల్యాణ్‌రావు.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూషను 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఆద్య అనే ఐదేళ్ల పాప ఉంది. గత మూడేళ్లుగా వీరు పోచారం మున్సిపాలిటీలోని ఇస్మాయిల్‌ఖాన్ గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.
సెల్‌ఫోన్ వాయిదాల లావాదేవీల విషయంలో రెండేళ్ల క్రితం కరుణాకర్ అనే వ్యక్తితో అనూషకు ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆత్మకూరు(ఎం)లో పంచాయతీ కార్యదర్శిగా కల్యాణ్ పనిచేసేవాడు. అతను విధులకు వెళ్లిన అనంతరం కరుణాకర్ అనూష వద్దకు వచ్చేవాడు. అతడి వెంట అప్పుడప్పుడూ అతడి స్నేహితుడు రాజశేఖర్ కూడా ఉండేవాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌తోనూ అనూష వివాహేతర సంబంధం పెట్టుకుంది. అనంతరం మెల్లమెల్లగా కరుణాకర్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది.
గొంతు కోసి చంపేశాడు
గత 3 నెలలుగా అనూష తనతో సరిగ్గా లేకపోవటంతో కరుణాకర్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె సంగతి తేల్చుకునేందుకు గత వారం ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ రాజశేఖర్ చెప్పులు, బైక్ కనిపించటంతో కోపంతో ఊగిపోతూ తలుపులు బాదాడు. అతడి రాకను గమనించిన అనూష.. రాజశేఖర్‌ను స్నానాల గదిలో దాచి, తలుపులు తీసింది. ఇంట్లోకి వచ్చిన కరుణాకర్, రాజశేఖర్ బయటికి రాకపోతే ఆద్యను చంపేస్తానంటూ బెదిరించాడు. అయినా రాజశేఖర్ రాకపోవడం వల్ల.. కరుణాకర్ కత్తి తీసుకుని చిన్నారి గొంతు కోసి చంపాడు. అనూషపైనా... ఆమెతో కలిసి ఉన్న రమేష్‌పైనా కత్తితో దాడి చేశాడు. అనంతరం కరుణాకర్ కత్తితో గొంతు కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతుండగానే ఆ కుటుంబంలో ఇవాళ మరో విషాదం చోటుచేసుకుంది.
ఎంతో గారాబంగా పెంచుకున్న కుమార్తె ఆద్య హత్యకు గురవటం.. తండ్రి హృదయాన్ని తల్లడిల్లేలా చేసింది. మరోపక్క భార్య ప్రవర్తనతో సమాజంలో తలెత్తుకోలేక తీవ్ర కుంగుబాటుకు గురైన కల్యాణ్... యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాత్కాలిక సుఖాల కోసం కుటుంబాన్ని నాశనం చేసుకున్న అనూష.. క్షణికావేశంతో విలువైన జీవితాన్ని అంతం చేసుకున్న కల్యాణ్ ఉదంతాలు కొందరికైనా కనువిప్పుగా మారాలి.
ఇదీ చదవండి: