అనంతపురం జిల్లాస్థాయి కొవిడ్ ఆసుపత్రిలో ఈనెల 5న ఓ వృద్ధురాలు కరోనా లక్షణాలతో చేరారు. మెుదట చికిత్సకు నిరాకరించిన బామ్మ... తర్వాత వైద్యులతో ఉత్సాహంగా మాట్లాడుతూ చికిత్సకు సహకరించారు. 16 రోజుల్లో కోలుకుని ఇంటికి వెళ్లారు. ఈమె కుమారుడు ఇటీవలే కరోనా సోకి మరణించారు. అతడి నుంచే వృద్ధురాలికీ, ఆమె మనవడికీ కరోనా సోకింది. బామ్మ, మనవడు ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో చికిత్స పొంది మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు. జిల్లాలో వీరిద్దరితోపాటు మరో ముగ్గురూ మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు. వీరంతా హిందూపురానికి చెందినవారే. అనంతపురం జిల్లాలో మంగళవారం 3 కొత్త కేసులు నమోదైనట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో హిందూపురానికి చెందిన ఒకరు, జిల్లా కేంద్రానికి చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన మహిళకు 2 రోజుల కిందట పాజిటివ్ వచ్చింది. ఆమెకు పాజిటివ్ నిర్ధారణ అయ్యాక బంధువులను పరీక్షించగా.. వారిలో ఇద్దరికి కరోనా సోకింది. ఇటీవల హిందూపురంలో అనుమానిత లక్షణాలు కనిపించడంతో స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకున్న ఇద్దరికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఒకరి భార్యకూ కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా.. కొత్త కేసులు 39