అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామంలో ఆదివారం మేతకు వెళ్లిన 41 మేకలు మృత్యువాత పడ్డాయి. మరో 100 మేకలు అపస్మారక స్థితిలో ఉన్నాయి. ఉదయం మేత కోసం అడవిలోకి వెళ్ళిన మందలోని మేకలు... సమీపంలోని వ్యవసాయ తోటలో నీళ్లు తాగాయి. అంతలో ఉన్నట్టుండి నలుగురు రైతులకు చెందిన మేకలు మరణించాయి. విషయంపై గ్రామంలోని పశు వైద్య అధికారులకు రైతులు సమాచారం అందించారు.
హుటాహుటిన రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల, పల్లెపల్లి, గుమ్మగట్ట మండలం పశు వైద్య అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి మేకలకు వైద్యం అందించారు. అప్పటికే పలు మేకలు మృత్యువాత పడ్డాయి. రసాయనిక మందులు పిచికారి చేసిన నీరు తాగడం వల్ల మరణించి ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు. బాధిత రైతులకు వైయస్సార్ పశు వైద్య భీమా అందించి.. ఆదుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: