37th Day of Anganwaadi Workers Strike: అంగన్వాడీ కార్యకర్తలు 37వ రోజు సమ్మెను ఉద్ధృతం చేశారు. పలు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈరోజు నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా వివిధ ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించారు.
Vijayawada:విజయవాడలో నిరాహార దీక్షకు ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికిి అంగన్వాడీ ఉద్యోగులు వినతిపత్రం సమర్పించి, పూలమాలలు వేసుకుని నిరవధిక నిరాహార దీక్షలో కూర్చొన్నారు. తమ డిమాండ్లు న్యాయబద్దమైనవని, ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామని, ప్రభుత్వం మాత్రం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. అంగన్వాడీ కార్యకర్తల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు చూస్తోందని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని శపథం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వేతనాలు పెంచుతామని హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని అంగన్వాడీలు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ఉక్కు పాదం మోపినా సమ్మె పట్టు సడలించేది లేదు- అంగన్వాడీలు
Konaseema: కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 37వ రోజు సమ్మెలో భాగంగా ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి టమాటా దండ వేసి, ఫొటో ముందు చీర, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఉంచారు. వీటిని గర్భిణీ అయిన ఓ అంగన్వాడీ కార్యకర్తకు ఇచ్చి శీమంతం జరిపి నిరసన తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సేకరిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం ప్రధాన రహదారిపై ప్రయాణికుల నుండి సంతకాలు సేకరించారు. తమ డిమాండ్లను పట్టించుకోని ముఖ్యమంత్రికి, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వానికి మాపై కక్ష ఎందుకు? - చర్చలకు పిలవకుంటే ఆందోళన ఉద్ధృతం: అంగన్వాడీలు
Anathapur : అనంతపురం జిల్లా గుత్తిలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు దీక్ష చేపట్టారు. మట్టి తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. జిల్లాలో శింగనమల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఐసీడీఎస్ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి సీఎం జగన్‌కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Nellore: నెల్లూరులో అంగన్వాడీలు చిన్నారులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా మానసిక హింసకు గురి చేస్తోందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి, గ్యాట్యుటీ అమలు చేయాలని నినాదాలు చేశారు. డిమాండ్లు సాధించేవరకు సమ్మె విరమించేది లేదని కర్నూల్లో అంగన్వాడీలు స్పష్టం చేశారు. ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ నిర్వహించామని, జీతాలు పెంపుపై లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పెదపాడులో ఐసీడీఎస్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు.
అంగన్వాడీల అలుపెరగని పోరాటం - డిమాండ్లు నేరవేర్చాలని డిమాండ్