YSRCP Samajika Sadhikara Bus Yatra: ప్రజాదరణ కోసం వైసీపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. అది అట్టర్ ఫ్లాప్ అవుతోంది. తొలుత గడపగడపకు కార్యక్రమం మొదలుపెట్టగా.. వైసీపీ నేతలు గడప వరకు కాదు కదా.. గ్రామానికి వస్తేనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్త మయింది. వెళ్లిన ప్రతి చోట.. ప్రజలంతా ఏకమై వైసీపీ నేతలను కడిగిపారేశారు. ఏ ముఖం పెట్టుకుని వస్తారంటూ మండిపడ్డారు.
ఇక ఇప్పుడు సామాజిక సాధికార బస్సు యాత్ర వంతు వచ్చింది. సభలకు రాకుంటే పథకాలు ఆపేస్తామంటూ ప్రజలను బెదిరించి ఏదో ఒక రకంగా తీసుకొస్తున్నారు. కానీ ఇష్టం లేకుండా వారైనా మాత్రం ఎంత సమయం ఉంటారు? సభ మొదలు అవ్వగానే గ్రూపులుగా కలిసి వెనుదిరుగుతున్నారు. దీంతో వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమం కూడా ఘోరంగా విఫలమైంది.
పాట పాడి ఖాళీ కుర్చీలకు జగనన్న గొప్పతనాన్ని వివరించిన మంత్రి
సభ ఎక్కడ నిర్వహించినా సరే.. సభ ప్రారంభం కాగానే ప్రజలంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేయడం.. వారిని వైసీపీ నేతలు బతిమలాడటం పరిపాటిగా మారిపోయింది. ఎంత చెప్పినా సరే.. ప్రజలు మాత్రం ఎదో ఒక వైపు నుంచి వెళ్లిపోతున్నారు. దీని కారణంగా ఖాళీ కుర్చీలకే మంత్రులు, ఎమ్మెల్యేలు తన పాటలను, ప్రసంగాలను వినిపిస్తున్నారు. తాజాగా మంత్రి అప్పలరాజు ఖాళీ కుర్చీలకు పాట పాడి వినిపించడం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీనిపై యువత తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర, సభలు సైతం జనం లేక వెలవెలబోయాయి. నేతలు, కార్యకర్తలు బ్యానర్లు కట్టి అట్టహాసంగా సభలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజాదరణ మాత్రం దక్కడం లేదు. అనకాపల్లి జిల్లాలో వైసీపీ బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన ముగింపు సభకు జనాదరణ కరవైంది.
తుస్సుమన్న వైసీపీ బస్సు యాత్ర - బారికేడ్లు పెట్టి బతిమలాడినా జారుకున్న జనం
అనకాపల్లిలోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో నిర్వహించిన సభలో మంత్రులు ధర్మాన ప్రసాద్, గుడివాడ అమర్నాథ్, రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. మంత్రులు ప్రసంగం మొదలవగానే.. జనం బయటకు జారుకున్నారు. దీంతో సభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సభ ప్రారంభం కాకుండానే కొందరు బయటకు వెళ్లేందుకు యత్నించారు. మంత్రులు మాట్లాడుతుండగానే జనాలు పలాయనం కావడం వల్ల ఖాళీ కుర్చీలతో మంత్రుల సభ వెలవెలబోయింది.
అయితే తొలుత మధ్యాహ్నం మూడు గంటలకి సభ ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ మంత్రులు మాత్రం సభా ప్రాంగణానికి సాయంత్రం నాలుగు గంటలు దాటిన తరువాత చేరుకున్నారు. దీంతో మంత్రులు ప్రసంగిస్తుండగా జనాలు సభ ప్రాంగణం నుంచి బయటికి వచ్చేసారు. సాయంత్రం నాలుగున్నరకే క్రీడ మైదానం నుంచి మహిళలు బయటకు రావడంతో ఖాళీ కుర్చీలు కనిపించాయి.
తుస్సు మంటున్న వైసీపీ బస్సు యాత్రలు - సభ మధ్యలోనే ఇంటిముఖం పడుతున్న కార్యకర్తలు