Vangalapudi Anitha Rally : ఎస్సీలకు విధించిన అధిక విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వరకు దళితులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఈ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎస్సీలకు విధించిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు.
ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేసిన ఘనత సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. దళితులకు అధిక విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపటమే కాకుడా.. పథకాలను సైతం రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించారని ఆరోపించారు. దళితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ దెబ్బకొట్టి ఛార్జీల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీటిని రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
"జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన 27 పథకాలను తీసేశారు. ఉపాధి లేదు, రుణాలు లేవు.. ఓటేసిన పాపానికి చివరికి కరెంట్ పీకేసే పరిస్థితి తలెత్తింది. కరెంటు బిల్లులు దళితులెవరూ కట్టకండి. ఎవరైనా కరెంటు బిల్లులు కట్టమని మిమ్మల్ని అడిగితే.. మీతో పాటు మేము పోరాటం చేస్తాం." - వంగలపూడి అనిత, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు
ఇవీ చదవండి: