Farmers unions fire on IT Minister Gudiwada Amarnath: వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత స్థానంలో చేపట్టిన పాదయాత్రలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక కర్మాగారాన్ని అమ్మేయాలని చూస్తున్నారని.. అనకాపల్లి జిల్లా రైతుల సంఘం నాయకులు, తుమ్మపాల స్థానిక రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఓ మాట అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నా.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా దొంగ దారిలో వాల్యూషన్ కమిటీ సభ్యులను పంపించి.. కర్మాగారాన్ని థర్ట్ పార్టీకి అమ్మేయాలని చూస్తుండగా తాము అడ్డుకున్నామని ఆవేదన చెందారు.
ప్రాణాలు ఉన్నంతవరకూ అడ్డుపడుతాం.. అనకాపల్లి జిల్లాలో తలమానికంగా నిలిచిన చక్కెర కర్మాగారాలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమ్మేసే ప్రక్రియ ప్రారంభించింది. ఒకప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టిన చక్కెర కర్మాగారాలను థర్డ్ పార్టీకి అమ్మేసేందుకు సిద్దమైంది. 1950 సంవత్సరం నుండి 2000 సంవత్సరం వరకు వందల మంది కార్మికులకు జీవన ఉపాధి కల్పించిన తుమ్మపాల చక్కెర కర్మాగారం ఆస్తుల విలువలను అంచనా వేయడానికి గుట్టుచప్పుడు కాకుండా వాల్యూషన్ కమిటీ సభ్యులను పంపించింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక రైతులు, సంఘాల నాయకులు కమిటీ సభ్యులను అడ్డుకుని.. తమ ప్రాణాలు ఉన్నంతవరకూ చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుంటామని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్పి చెప్పారు.
మంత్రి అమర్నాథ్ రాజీనామా చేయాలి.. మాట్లాడుతూ..''అనకాపల్లి జిల్లా తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అమ్మేయాలని చూస్తున్నారు. ఈరోజు కర్మాగారంలో ఉన్న పరికరాల ఆస్తులు విలువలను అంచనా వేయడానికి వాల్యూషన్ కమిటీ సభ్యులను కర్మాగారానికి పంపించారు. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చేసిన పాదయాత్రలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కర్మాగారంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు. చక్కెర కర్మాగారంపై ఇచ్చిన హామీని మంత్రి గుడివాడ అమర్నాథ్ మరిచి, విలువైన ఆస్తులు కాజేయాలని చూస్తున్నారు. ఇటీవలే లిక్విటేషన్ కమిటీని ఏర్పాటు చేసి, కర్మాగారాన్ని అమ్మాలనే ఉద్దేశ్యంతో ఈరోజు వ్యాల్యూషన్ కమిటీని పంపించారు'' అని అన్నారు.
ఎంతటి పోరాటానికైనా మేము సిద్దం.. అనంతరం కమిటీ సభ్యులను అడ్డుకొని.. ఎందుకు ఇక్కడి వచ్చారు..? ఎవరు పంపించారు..? అని ప్రశ్నించగా వారి వద్ద సమాధానాలు లేకపోవడంతో తిరిగి పంపించేశామని రైతులు తెలిపారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కర్మాగారంపై ఏ నిర్ణయం తీసుకుంటున్నారో..? మంత్రి గుడివాడ అమర్నాథ్ బహిరంగ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. సహకార రంగంలో కొనసాగుతున్న చక్కెర కర్మాగారంలో రైతులంతా పెట్టుబడులు పెట్టారని గుర్తు చేశారు. రైతులతో జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా కమిటీని ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. కర్మాగారం ఆస్తులను కాజేయాలని చూస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్మాగారం ఆస్తులను కాపాడుకోవడానికి ఎంతటి పోరాటమైన చేస్తామని తేల్చి చెప్పారు.