carrying the dead body on doli: ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ గిరిజనుల తలరాతలో ఎలాంటి మార్పు రావటం లేదు. వారికి అవస్థలు తప్పడం లేదు ఇందుకు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలంలోని చీమలపాడు పంచాయతీ శివారు చలసింగం గ్రామస్థులే నిదర్శనం. తరచూ ఎన్నికలు వస్తున్నాయి.. పాలకుల మారుతున్నారు కానీ వారు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. చలి సింగం గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని చాలాకాలం నుంచి గిరిజనులు అధికారులకు మొర పెట్టుకుంటున్నారు.
ప్రజా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు వినతులు అందజేస్తున్నా అవి నెరవేరడం లేదు. వారి జీవన శైలిలో మార్పులు రావడం లేదు.. విద్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన మాట ఎలా ఉన్నా.. వైద్యం వారికి అందని ద్రాక్షలా మారింది. తరచూ రోగులను డోలీ కట్టి నర్సీపట్నం కొత్తకోట వంటి ప్రాంతాలకు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాల్సి వస్తోంది. అధేవిధంగా ఈ నెల 21వ తేదీన సాయంత్రం.. చలి సింగం గ్రామానికి చెందిన కొప్పుల రవీంద్ర అనే యువకుడికి తీవ్రమైన జ్వరం, ఒళ్లు, తలనొప్పులతో ఇబ్బంది పడుతుండగా.. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రవీంద్ర అక్కడ వైద్యం పొందుతూ ఈనెల 23వ తేదీ రాత్రి మృతి చెందడంతో.. మృతదేహాన్ని డోలి కట్టి అనేక అవస్థలతో కొండలు, గుట్టల్లోనూ నడిచి తరలించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమకు కనీస రహదారి సదుపాయం కల్పించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: