Power cuts Problems for jaggery industries: అనకాపల్లి జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు చెరకు పంట సాగు చేస్తుంటారు. మునగపాక, కశింకోట, అనకాపల్లి, అచ్చుతాపురం, ఎలమంచిలి, బుచ్చయ్యపేట, చోడవరం, కె.కోటపాడు మండలాల్లో సుమారు 52 వేల ఎకరాల్లో పంటను సాగుచేస్తున్నారు. గతంలో 80 శాతం పంటను చక్కెర కర్మాగారాలకు తోలేవారు. మిగతా 20 శాతం బెల్లం తయారీకి వినియోగించేవారు. క్రమంగా తుమ్మపాల, తాండవ, ఏటికొప్పాక చక్కెర ప్యాక్టరీలు ఒక్కోక్కటిగా మూతపడుతూ వచ్చాయి. దీంతో 80 శాతం పంటను బెల్లం తయారీకే ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో బెల్లం ధరలు అంతకంతకు పడిపోయాయని రైతులు చెబుతున్నారు. అయినా మరో ఉపాధి లేక బెల్లం తయారీని కొనసాగిస్తున్నామంటున్న రైతులు...ప్రస్తుతం విధిస్తున్న కరెంట్ కోతలతో అదీ నిలిచిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
" రైతులకు 9 గంటల కరెంటు ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ గంట, రెండు గంటలు... అదీ రాత్రి పూట ఎప్పుడిస్తున్నారో తెలియడం లేదు. పంటలు పండటం లేదు. రేటు లేకపోయిన వేరే పని తెలియక, చేయలేక వ్యవసాయం చేస్తుంటే దానిని కూడా చేయనివ్వకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి సరైన స్పందన లేకపోతే... రైతులకు 9 గంటల విద్యుత్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తగిన భారీ మూల్యం ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని రైతుల తరఫున హెచ్చరిస్తున్నాను."- చెరుకు రైతు
Power cuts Problems for jaggery industries: గతంలో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉండేదని వారం రోజులుగా ఎప్పుడు కరెంటు ఇస్తున్నారో..ఎప్పుడు నిలిపేస్తున్నారో తెలియడం లేదంటున్నారు. చెరకు క్రషింగ్ పూర్తిస్థాయిలో చేయలేక పొలంలో నుంచి పంటను తెచ్చుకోలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారు.
"ఇంతకాలం నుంచి చెరుకు వేయడం వల్ల పెద్దగా నష్టం రాలేదు. కరెంటు, ధరలు సాధారణంగా ఉండేది. ఇప్పుడు ధరలకు, కరెంటుకు మాకు ఎలాంటి సంబంధం లేకుండాపోయింది. గతంలో 9 గంటల కరెంటు అనుకున్న సమయంలో ఇచ్చేవారు. ప్రస్తుతం ఎప్పుడు కరెంటు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. కరెంటు పోయి సగం మిషిన్‌లో ఉన్న చెరుకు రసం వృథాగా పోతుంది. అది మరగబెట్టుకోవడానికి అవ్వదు. పారబోయాల్సి వస్తుంది. తీవ్ర నష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోంది." - చెరుకు రైతులు
పరిస్థితి ఇలానే కొనసాగితే తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామంటున్న రైతులు, బెల్లం తయారీదారులు ఇప్పటికైనా కోతల నుంచి తమకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరెంటు దొరక్కపోతే.. కోతలు తప్పవు: ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్