'అసని' తుపాను దాటికి తాటి చెట్టు నేలకూలి ఎంపీటీసీ మృతిచెందాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు తుంపాల కాసులు వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చి ఇంటికి తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో తుపాను కారణంగా భీకరంగా వీస్తున్న గాలులకు ఓ తాటి చెట్టు కూలి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కాసులు మీద పడింది. దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
మళ్లీ మారిన 'అసని' దిశ: తీవ్రతుపాను 'అసని'.. తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దిశ మార్చుకుని 3 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మచిలీపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో, నరసాపురానికి 30 కి.మీ, కాకినాడకు 130, విశాఖకు 270 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో కోనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత రాత్రికి తిరిగి పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తీరంలో 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు.
ఇవీ చూడండి :