Joint Committee report to NGT: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలోని హెటిరో లేబొరేటరీ పరిశ్రమ నిర్వాహకులు.. తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ (సీఆర్‌జెడ్) అనుమతి లేకుండా కొన్ని పనులు చేపట్టినట్లు సంయుక్త కమిటీ పేర్కొంది. ఈ పరిశ్రమ కార్యకలాపాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఈ కమిటీ.. ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ)కు తన నివేదికను సమర్పించింది.
అందులో... సీఆర్‌జెడ్ అనుమతి లేకుండా గొట్టాలు, డిశాలినేషన్ యూనిట్ ఏర్పాటు చేయడాన్ని గుర్తించింది. దీనికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ అనుమతులు అవసరం. వృథా నీటి నుంచి హానికర నీటిని వేరు చేసే పంపింగ్ వ్యవస్థ లేదని గమనించింది. తనిఖీ సమయంలో గాలి, నీరు, బోర్లు, బావుల నుంచి భూగర్భ జలాల నమూనాలను సేకరించామని, వాటిని విశ్లేషించేందుకు కొంత సమయం పడుతుందని, వాటి నివేదికలు వచ్చిన తరువాత అందులోని అంశాల ఆధారంగా తగిన పరిష్కార మార్గాలు చూపుతామని కమిటీ పేర్కొంది.
ఈ పరిశ్రమ విడుదల చేస్తున్న రసాయనాల వల్ల భూసారంతో పాటు నీటి వనరులు పాడవుతున్నాయని గ్రామస్థులు ఎన్‌జీటీకి ఫిర్యాదు చేయడంతో ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటైన విషయం విదితమే. ఈ కమిటీ అక్కడి వాస్తవ పరిస్థితులను గుర్తించి సంబంధిత పరిశ్రమ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడింది? కాలుష్య నియంత్రణ విధానాలను సక్రమంగా పాటిస్తోందా లేదా అన్న అంశాలను పరిశీలించింది.
అనుమతి లేకుండా తీరంలో ఏమైనా గొట్టాలు ఏర్పాటు చేసిందా? సముద్ర జీవులకు నష్టం కలిగేలా చర్యలున్నాయా? భూగర్భ జలాల నాణ్యత, అవి ఎంతవరకు ప్రభావితం అయ్యాయి.. తదితర అంశాలపై దృష్టి సారించి రూపొందించిన నివేదికను సమర్పించింది.
ఇదీ చదవండి: