ఓట్లను అక్రమంగా తొలగించే కుట్రపై వైకాపా నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారని మంత్రి దేవినేని అన్నారు. ఫారం-7 ద్వారా నకిలీ దరఖాస్తులతో ఓట్లు తొలగించే కుట్రకు పాల్పడుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. తెరాస, భాజపా, ఎంఐఎంతో చేతులు కలిపి జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా జగన్ నడుచుకుంటున్నారని అన్నారు. సీఎం కుర్చీ కోసం ఎన్ని అరాచకాలైనా చేయగల సమర్థుడు జగన్ అని విమర్శించారు. బహిరంగసభల్లో జగన్ మాట్లాడుతున్న పదజాలం మార్చుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారన్నారు. అధికారమే పరమావధిగా జగన్ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు.
ఫారం-7 తానే దరఖాస్తు చేయించానని జగన్ ఒప్పుకున్నారని తెలిపారు. ఎన్నికల ముద్దాయి జగనే అన్నది బహిర్గతమైందన్నారు. జగన్ నిన్న స్వయంగా ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ లో 24లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని మంత్రి ఆరోపించారు. అదే విధంగా రాష్ట్రంలో 54లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారని అన్నారు. సీఎం కుర్చీ కోసం ఎన్ని ఆరాచకాలైనా చేయగల సమర్ధుడు జగన్ అని ఎద్దేవా చేశారు. నెల్లూరు సభలో జగన్ మాట్లాడిన భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. ఓ అజెండా అంటూ లేకుండా దిక్కుతోచని స్థితిలో జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్బీఐ ఇచ్చిన గణాంకాలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ప్రతిభ కనబరచటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.